నేడు బందరులో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలోని 3 గ్రామాల్లో పర్యటించి అక్కడి రైతులతో మాట్లాడి వారి సాధకబాధకాలను తెలుసుకుంటారని ఆ పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ మంగళవారం తెలిపారు. బందరు పోర్టుకు అనుబంధంగా ఏర్పాటు చేయనున్న పరిశ్రమల కోసం భూసేకరణలో ఉన్న గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తారని ఆయన వివరించారు. బుధవారం ఉదయం 8.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గాన మచిలీపట్నం మండలంలోని కరగ్రహారానికి చేరుకుంటారని తెలిపారు.
అక్కడి ఫరీద్‌బాబా దర్గా సెంటర్ వద్ద రైతులతో, గ్రామస్తులతో మాట్లాడతారని చెప్పారు. అక్కడి నుంచి తుమ్మలచెరువు చేరుకొని వినాయకుడి గుడి సెంట ర్‌లో రైతులతో మాట్లాడతారు. అక్కడి నుంచి పొట్లపాలెం చేరుకొని పంచాయతీ కార్యాలయం సెంటర్‌లో రైతులతో మాట్లాడతారన్నారు. అక్కడి నుంచి తిరుగు పయనమై గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాదుకు వెళతారని తలశిల రఘురామ్ తెలిపారు.