విదర్భకు ఓకే.. గూర్ఖాలాండ్‌కు నో! | Jairam Ramesh for Vidharba but not Gorkhaland | Sakshi
Sakshi News home page

విదర్భకు ఓకే.. గూర్ఖాలాండ్‌కు నో!

Published Tue, Feb 25 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 4:03 AM

విదర్భకు ఓకే.. గూర్ఖాలాండ్‌కు నో!

విదర్భకు ఓకే.. గూర్ఖాలాండ్‌కు నో!

 బోడోలాండ్‌నూ సమర్థించను: జైరామ్

 ‘తెలంగాణకు’ హామీ ఇచ్చాం

 సీమాంధ్ర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్నాం

 న్యూఢిల్లీ: మహారాష్ట్ర నుంచి విదర్భను విడదీయాలన్న డిమాండ్‌ను సమర్థిస్తానని ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్న కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్ సోమవారం ప్రకటించారు. అయితే వ్యూహాత్మక కారణాల రీత్యా పశ్చిమబెంగాల్‌లోని గూర్ఖాలాండ్ డిమాండ్‌ను మాత్రం సమర్థించబోనన్నారు. అలాగే అసోంలోని బోడోలాండ్ డిమాండ్‌నూ సమర్థించనన్నారు. విదర్భ డిమాండ్ కూడా గతంలో ఎప్పట్నుంచో ఉన్నదేనన్నారు. ఎన్సీపీతో పాటు బీజేపీ కూడా అందుకు సానుకూలమేనని, కేవలం శివసేనను ఒప్పిస్తే సరిపోతుందని ఒక చానల్ ఇంటర్వ్యూలో ఆయన అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌ను కూడా నాలుగు ముక్కలు చేయాలని రెండు రోజుల క్రితమే జైరాం గట్టిగా డిమాండ్ చేయడం తెలిసిందే. ప్రస్తుత రూపంలో ఉత్తరప్రదేశ్ పాలన కష్టసాధ్యమని జైరామ్ చెప్పారు. ఆ రాష్ట్రంలో ఏకంగా 20 కోట్ల జనాభా, 74 లేదా 75 జిల్లాలు, 800 బ్లాకులు ఉన్నాయన్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా యూపీని సమర్ధంగా పాలించలేదన్నారు. అందుకే ఆ రాష్ట్ర విభజనను తాను సమర్థిస్తున్నానన్నారు. అరుుతే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, కాంగ్రెస్ పార్టీది కానీ, భారత ప్రభుత్వానిది కానీ కాదని చెప్పారు.

 తెలంగాణకు, ఎన్నికలకు సంబంధం లేదు

 ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పోతుందని తాననుకోనన్నారు. ఎన్నికలకు, తెలంగాణ ఏర్పాటుకు సంబంధం లేదన్నారు. 60 ఏళ్ల క్రితం నుంచే తెలంగాణ అంశం ఉందని, ఇటీవల పదేళ్లలో కూడా ఇది తీవ్రంగా ఉందని, 2004లో తెలంగాణ ఏర్పాటుకు తాము హామీ ఇచ్చామని చెప్పారు. కాంగ్రెస్‌లోనే భిన్నాభిప్రాయూలు ఉన్నప్పటికీ ఇచ్చినమాటకు కట్టుబడి ముందుకు వెళ్లామన్నారు. సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలు, ఆందోళనలు పూర్తిగా దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకున్నామన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటికీ సీమాంధ్రకు మంచి అభివృద్ధి ప్యాకేజీ లభించిందని చెప్పారు. సీమాంధ్రకిచ్చిన ప్రత్యేక హోదాను జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డీసీ) ధ్రువీకరించనుందని తెలిపారు. హైదరాబాద్‌లో వస్తున్న ఆదాయమంతా సీమాంధ్ర కోల్పోరుు తెలంగాణకు జమ అవుతుందని చెప్పారు. వనరులు కూడా తగ్గిపోతాయని, ఈ దృష్ట్యానే ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తున్నట్టు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement