
తిరగబడ్డ తమిళయువత.. మంత్రి తరిమివేత!
కోయంబత్తూరు: జల్లికట్టు కోసం తమిళవాసులు నిర్వహిస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారుతోంది. ఆందోళనకారులను బలవంతంగా తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండటంతో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారుతున్నాయి. కొన్నిచోట్ల పరిస్థితులు అదుపుతప్పి హింస నెలకొంటున్నది. కోయంబత్తూరులోని కొడిశా మైదానంలో జల్లికట్టుకు మద్దతుగా నిర్వహిస్తున్న ఆందోళన సోమవారం హింసాత్మక రూపు దాల్చింది.
ఇక్కడ ఆందోళన నిర్వహిస్తున్న వారిని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు మంత్రి వెలుమణి, పోలీసు కమిషనర్‌తో కలిసి వచ్చారు. వారు నిరసనకారులతో చర్చలకు ప్రయత్నించగా.. వారిని చూసిన వెంటనే జనం ఊగిపోయారు. ఆగ్రహంతో రగిలిపోయారు. వెనుకకు వెళ్లిపోవాల్సిందిగా సూచిస్తూ దాడులకు దిగారు. మంత్రి వెలుమణి, పోలీసు కమిషనర్ వాహనాలపై రాళ్లతో, కర్రలతో దాడులు చేసి తరిమేశారు. దీంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి వాహనంపై దాడులకు దిగిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట కూడా చోటుచేసుకుంది.