
త్వరలోనే ఇంటికి జయలలిత!
చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత త్వరలోనే మంచి ఆరోగ్యంతో ఇంటికి చేరుకుంటారని..
- ఎండీఎంకే నేత ఆశాభావం
చెన్నై: తీవ్ర అనారోగ్యానికి గురై గత 15 రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత త్వరలోనే మంచి ఆరోగ్యంతో ఇంటికి చేరుకుంటారని ఎండీఎంకే నేత వైకో ఆశాభావం వ్యక్తం చేశారు. వైకో శనివారం అపోలో ఆస్పత్రిలో జయలలితను పరామర్శించారు. అనంతరం ఆయన తమిళనాడు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావును ’స్నేహపూర్వకంగా’ కలిశారు.
ఈ సందర్భంగా వైకో విలేకరులతో మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి బాగున్నారు. ఆమెకు అవసరమైన వైద్య చికిత్సను అందిస్తున్నారు. మంచి ఆరోగ్యంతో ఆమె ఇంటికి చేరబోతున్నారు. త్వరలోనే అన్నాడీఎంకే కార్యకర్తల ఆందోళన దూరమవుతుంది’ అని పేర్కొన్నారు. గవర్నర్ విద్యాసాగర్ రావుతో తాను స్నేహపూర్వకంగా భేటీ అయ్యాయని, ఒకప్పటి విషయాలు తాము చర్చించుకున్నామని, కానీ రాజకీయాలు ప్రస్తావనకు రాలేదని చెప్పారు. సీఎం జయలలిత కోలుకునేవరకు గవర్నర్ తాత్కాలికంగా పాలనాపగ్గాలు చేపట్టాలన్న డీఎంకే నేత స్టాలిన్ డిమాండ్‌ను ఆయన తప్పుబట్టారు. అలాంటి అవసరం లేదని పేర్కొన్నారు. కావేరి జలాల విషయంలో తమిళనాడు ప్రయోజనాలను సీఎం జయలలిత కాపాడుతున్నారని వైకో ప్రశంసించారు.