‘ఆక్రోశ్ దిన్’కు జేడీయూ దూరం
- బంద్‌లో పాల్గొనబోము: మమతా బెనర్జీ
న్యూఢిల్లీ: నోట్ల రద్దు అంశంపై కేంద్ర ప్రభుత్వంతో అమీతుమీ తలపడుతోన్న విపక్షపార్టీల కూటమికి మరో ఝలక్. నోట్ల రద్దు నిర్ణయాన్ని, అమలు తీరును వ్యతిరేకిస్తోన్న విపక్ష పార్టీలు కలిసి ఈ నెల 28న(సోమవారం) దేశవ్యాప్త బంద్‘ఆక్రోశ్ దిన్’ను తలపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బంద్‌లో పాల్గొనబోమని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించగా, తాజాగా నితీశ్ కుమార్ అధ్యక్షుడిగా ఉన్న జనతాదళ్ యునైటెడ్- జేడీయూ కూడా ‘ఆక్రోశ్’కు దూరంగా ఉంటామని ప్రకటించింది. ఈ మేరకు జేడీయూ కీలక నేతలు తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాన కార్యాలయం వెల్లడించింది.
నోట్ల రద్దు వ్యతిరేక ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామన్న వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. భారత్ బంద్ వల్ల పేదలు మరింత ఇబ్బందులు పడతారని, అందుకే ‘ఆక్రోశ్ దిన్’లో భాగస్వాములు కాబోమని తెలిపారు. బంద్ బదులు సోమవారం(28న) కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని ఆమె చెప్పారు. జేడీయూది కూడా దాదాపు ఇదే వాదన. జేడీయూ చీఫ్ నితీశ కుమార్ మొదటి నుంచి ప్రధాని మోదీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నప్పటికీ పార్టీ పరంగా పార్లమెంట్‌లో నోట్ల రద్దు వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్నారు. తాజా ప్రకటనతో నితీశ్ అభిప్రాయమే పార్టీ అభిప్రాయమని తేటతెల్లమైంది. అయితే జేడీయూ మిత్రపక్షం ఆర్జేడీ మాత్రం ‘ఆక్రోశ్’లో పాల్గొంటున్నది. కాంగ్రెస్ పార్టీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, శరద్ పవార్ ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, శివసేన తదితర పార్టీలు బంద్‌లో యధావిధిగా పాల్గొంటున్నాయి.