పెద్దనోట్ల రద్దు విషయం వారికి ముందే తెలుసు
పట్నా: ప్రధాని నరేంద్ర మోదీ 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసేముందు బిహార్ బీజేపీ శాఖ భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసిందని, దీనిపై విచారణ చేయించాలని ఆ రాష్ట్ర అధికార పార్టీలు జేడీయూ, ఆర్జేడీలు డిమాండ్ చేశాయి. బిహార్‌లోని పలు ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువైన భూములను బీజేపీ కొనుగోలు చేసిందని శుక్రవారం ఆ పార్టీల నేతలు ఆరోపించారు. అక్టోబరు చివరి, నవంబర్ మొదటి వారంలో బీజేపీ ఈ భూములను కొనుగోలు చేసిందని చెప్పారు.
బిహార్‌లోని 25 జిల్లాల్లో బీజేపీ భూములు కొనుగోలు చేసిందని స్థానిక హిందీ న్యూస్ ఛానెల్ నిన్న ఓ కథనాన్ని ప్రసారం చేసింది. పార్టీ ఆఫీసుల నిర్మాణం కోసం భూములు కొనుగోలు చేసిందని, ఇందులో బీజేపీ ఎమ్మెల్యే సంజీవ్ చౌరాసియాకి ప్రమేయముందని ఆరోపించింది. పాతనోట్లను రద్దు చేయడానికి ముందు బీజేపీ బ్లాక్ మనీతో పెద్ద ఎత్తున భూములు కొనుక్కుందని ఆర్జేడీ ఎమ్మెల్యే భాయ్ వీరేంద్ర ఆరోపించారు. దీన్నిబట్టి పెద్ద నోట్ల రద్దు వ్యవహారం బీజేపీ నాయకులకు ముందే తెలుసని అన్నారు. దీనిపై అత్యున్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జేడీయూ నేత నీరజ్ కుమార్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. కాగా భూముల కొనుగోలు విషయంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని, ఆఫీసుల నిర్మాణం కోసం బీజేపీ తరఫున ఈ భూములు కొన్నామని చౌరాసియా చెప్పారు.