అత్యధిక పారితోషికం అందుకునే నటి ఈమెనట..
ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటీమణి ఎవరో తెలుసా..? మళ్లీ "హంగర్ గేమ్స్" స్టార్ జెన్నిఫర్ లారెన్సేనట. వరుసగా రెండో ఏడాది కూడా ఈ బ్యూటీనే అత్యధిక పారితోషికం అందుకునే జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ మ్యాగజీన్ వెల్లడించిన 2016లో అత్యధిక పారితోషికం అందుకునే నటీమణుల జాబితాల్లో, 46 మిలియన్ డాలర్ల(308కోట్లకు పైగా)తో జెన్నిఫర్ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. జెన్నిఫర్ తర్వాతి స్థానంలో మెలిస్సా కార్టీ నిలిచినట్టు ఫోర్బ్స్ మంగళవారం వెల్లడించింది.
ప్రఖ్యాత అమెరికన్ రచయిత సుజానే కోలిన్స్ నవల ఆధారంగా తెరకెక్కిన హంగర్ గేమ్స్ నుంచి వచ్చిన లాభాలతో ఈ నటి మళ్లీ టాప్ నిలిచినట్లు ఫోర్బ్స్ తెలిపింది. హాలీవుడ్ నటులు అందుకుంటున్న పారితోషికాలు కంటే నటీమణులు అందుకునే పారితోషికాలు ఇంకా తక్కువగానే ఉంటున్నాయని లారెన్స్ మరోసారి స్పష్టంచేసింది. పారితోషికం చెల్లించడంలో లింగవివక్ష చూపుతున్నారని లారెన్స్ చేసిన వ్యాఖ్యలు గతేడాది చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
అయితే గతేడాదితో పోలిస్తే జెన్నిఫర్ ఆదాయాలు 2016లో 11.5 శాతం క్షీణించాయి. గతేడాది ఆమె పారితోషికం 52 మిలియన్ డాలర్లు. మొత్తంగా అత్యధిక పారితోషికం అందుకుంటున్న 10 మంది నటీమణుల సంపద 205 మిలియన్ డాలర్లుగా ఉందని ఫోర్బ్స్ తెలిపింది. మూవీస్, టీవీ, కాస్మోటిక్, ఇతర కంపెనీల నుంచి వచ్చే ఎండోర్స్మెంట్స్ ఆదాయాలను పరిగణలోకి తీసుకుని ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందిస్తుంది. ఈ లిస్టులో న్యూకామర్గా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణే నిలిచారు. 10 మిలియన్ డాలర్లతో దీపికా టాప్ 10లో చోటుదక్కించుకుంది.