పాక్ కాల్పుల్లో ఐదుగురి మృతి
సరిహద్దుల్లో పాక్ బరితెగింపు.. 22 మందికి గాయాలు!
జమ్మూ: భారత స్వాతంత్య్ర దినోత్సవాన సైతం సరిహద్దులో పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. జమ్మూ కశ్మీర్ పూంచ్ జిల్లాలో సరిహద్దు ప్రాంతాల్లోని 4 సెక్టార్లలో.. జనావాసాలపై భారీ కాల్పులు, మోర్టార్ బాంబులతో విరుచుకుపడింది. దాడిలో ఒక సర్పంచ్ సహా నలుగురు పౌరులు మృతిచెందగా మరో ఐదుగురు గాయపడ్డారని అధికారికంగా చెప్తున్నా.. 22 మంది గాయపడినట్లు సమాచారం. పాక్ సేనలు ప్రయోగించిన మోర్టారు బాంబు బసోనీలో ఓ కారుపై పడటంతో అందులోని ముగ్గురు మరణించారు.
మరో ఇద్దరు గాయాలపాలై చనిపోయారు. ఘటనాస్థలి వద్ద గుమిగూడిన స్థానికులపైనా పాక్ సేనలు తూటాల వర్షం కురిపించడంతో ఓ బాలుడు సహా ఐదుగురు గాయపడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి దాటినప్పటి నుంచి శనివారం ఉదయం 7:30 వరకు పాక్ రేంజర్లు 60 ఎంఎం, 82 ఎంఎం మోర్టార్ బాంబులతో సరిహద్దు ప్రాంతాలపై విరుచుకుపడ్డాయి. పాక్ దళాల దాడిని భారత జవాన్లు దీటుగానే తిప్పికొట్టారు. కాగా, బిహార్‌లోని నవాడాలో ఓ స్కూళ్లో స్వాతంత్య్ర వేడుకలు జరుగుతుండగా కొందరు దుండగులు బాంబులు విసరడంతో ఇద్దరు బాలికలు గాయపడ్డారు.