తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ క్షమాపణలు చెప్పారు. రైల్వే బడ్జెట్ లో పశ్చిమ బెంగాల్ కు అన్యాయం జరిగిందంటూ లోక్సభ కార్యకలాపాలను తృణమూల్ ఎంపీలు అడ్డుకున్నారు. పోడియం వద్దకు దూసుకెళ్లి గందరగోళం సృష్టించారు. ఈ సందర్భంగా స్పీకర్ కు వ్యతిరేకంగా కళ్యాణ్ బెనర్జీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
'మీరు బీజేపీ స్పీకర్ కాదు. మీరు నరేంద్ర మోడీ స్పీకర్ కాదు' అంటూ వ్యాఖ్యానించారు. కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలపై అధికార కూటమి మండిపడింది. రైల్వే బడ్జెట్ సందర్భంగా లోక్సభలో అధికార బీజేపీ ఎంపీ ఒకరు మద్యం తాగొచ్చి అల్లరి చేశారని కళ్యాణ్ బెనర్జీ మంగళవారం ఆరోపించారు. అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించారని మండిపడ్డారు. కల్యాణ్ బెనర్జీ సభ నుంచి బయటకు వెళుతుంటే ఓ బీజేపీ ఎంపీ బెదిరించారని తృణమూల్ మహిళా ఎంపీ కకోలి ఘోష్ తెలిపారు.