
సినీ నటుడు కమల్ హాసన్ ఫైర్
తమిళ సినీ నటులు సూర్య, విజయ్ బాటలోనే ప్రముఖ స్టార్ హీరో కమల్ హాసన్ కూడా పెటాపై మండిపడ్డారు. తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జంతు హక్కుల సంస్థ పెటా తీరుపై మండిపడ్డారు. భారతీయ ఎద్దులను అణచివేసే అర్హత పెటాకు లేదని విమర్శించారు.
కావాలంటే డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికాలో నిర్వహించే బుల్ రైడింగ్ రోడియోస్‌ను నిషేధించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈమేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. ఎట్టకేలకు ప్రజలకు ప్రజాస్వామ్యమంటే ఏమిటో తెలుస్తున్నదని, నాయకుల రోజులు పోయాయని ఆయన పేర్కొన్నారు. వినయంతో కూడిన మార్గఅన్వేషకులు, సామాజిక సంస్కరణవేత్తలు మనకు కావాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు తమిళనాడు అంతటా జల్లికట్టు ఉద్యమం ఉధృతరూపు దాల్చిన సంగతి తెలిసిందే. మెరీనా బీచ్‌లోని ఆందోళన చేస్తున్న యువతను బలవంతంగా తరలించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తమిళనాడు అంతటా నిరసనలు ఎగిసి పడుతున్నాయి. ఎక్కడికక్కడ ఆందోళనకారులు పోలీసులపై తిరగబడుతున్నారు. దీంతో రాష్ట్రంలో పలుచోట్ల తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.