పారితోషికం తీసుకోకుండా నటించను
ఈ రంగంలో నేనుంది డబ్బుకోసమే. పారితోషికం తీసుకోకుండా నేను నటించను అని పేర్కొన్నారు విశ్వనటుడు కమలహాసన్. ఒక పక్క విశ్వరూపం–2 చిత్ర విడుదల పనుల్లో బిజీగా ఉన్న ఆయన మరో పక్క తన తాజా చిత్రం శభాష్‌నాయుడు బ్యాలెన్స్ చిత్రీకరణను పూర్తి చేసే పనిలోనూ నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే నటుడిగా 50 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ విశ్వనటుడు తాజాగా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హిందీలో అమితాబ్‌బచ్చన్, సల్మాన్‌ఖాన్‌లు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ పోటీ కార్యక్రమం తమిళంలో ప్రసారం కానుంది.
ఈ కార్యక్రమానికి నటుడు కమలహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. దీని టీజర్ బుధవారం ఆ టీవీ నిర్వాహకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా కమల్ బుల్లితెరకు పరిచయం కావడం గురించి క్లారిటీ ఇస్తూ డబ్బు కోసమే తాను బుల్లితెరపై వ్యాఖ్యాతగా అవతారమెత్తాను అని చెప్పారు. డబ్బు కోసమే తానీరంగంలో ఉన్నానని, పారితోషికం తీసుకోకుండా తాను నటించనని అన్నారు. ఇక బుల్లితెరకు పరిచయం అవడం వల్ల డబ్బుతో పాటు సినిమాలకంటే ఎక్కువగా ప్రేక్షకులకు దగ్గరవ్వొచ్చని అన్నారు. ఇలా రెండూ ఒకే చోట లభించడంతో ఎవరు మాత్రం వద్దంటారని కమలహాసన్ ప్రశ్నించారు. అందుకే బిగ్‌బాస్ కార్యక్రమానికి ఉత్సాహంగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.