తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సిద్ధరామయ్య వ్యంగ్యాస్త్రాలు
హోమాలతో రాష్ట్రం అభివృద్ధి అవుతుందా?
సాక్షి, బెంగళూరు: ‘రాష్ట్రం అభివృద్ధి చెందాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ అయుత చండీయాగాన్ని నిర్వహించారు. హోమాలు చేసినంత మాత్రాన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? ఈ విషయంలో శాస్త్రీయత ఉందా?’ అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రశ్నించారు. మంగళవారం విధానసౌధలో ఏర్పాటు చేసిన కవి కువెంపు జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాగాలు చేస్తే వర్షాలు పడతాయా? అదే కనుక నిజమైతే దేశంలో కరువు ఛాయలే కనిపించేవి కాదు.
దేశాన్నే సుభిక్షంగా చేసేవాళ్లం’ అని ఎద్దేవా చేశారు. చదువుకున్న వాళ్లు కూడా కొన్ని విషయాలను గుడ్డిగా నమ్మడం బాధ కలిగిస్తోందన్నారు.