తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుణ్ణి చేయటంలో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు పాత్ర ఉందని తెలుగుదేశం తెలంగాణ ఫోరం నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, రేవూరి ప్రకాష్‌రెడ్డి చెప్పారు.
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుణ్ణి చేయటంలో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు పాత్ర ఉందని తెలుగుదేశం తెలంగాణ ఫోరం నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, రేవూరి ప్రకాష్‌రెడ్డి చెప్పారు. ఆ సమయంలో కేసీఆర్ మంత్రిగా ఉన్నారని తెలిపారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్‌రావు ఆ సమయంలో కేసీఆర్ వెనుక ఫైళ్లు, చెప్పులు మోస్తూ తిరిగే వారని అన్నారు. టీడీపీ నేతలు బుధవారం టీడీఎల్పీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామంటూనే సీమాంధ్రుల గురించి చంద్రబాబు మాట్లాడితే పొరపాటు ఎలా అవుతుందని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నలకు బదులేది?
విలేకరుల సమావేశానికి సాక్షి పత్రికను ఆహ్వానించలేదు. ఒకవేళ ఆహ్వానించి ఉంటే సాక్షి కొన్ని ప్రశ్నలను అడగాలని భావించింది. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేయడంలో కేసీఆర్ పాత్ర ఉందంటున్న మీరు ఆ ప్రక్రియలో చంద్రబాబు పాత్ర ఏమిటి? ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్టు అంగీకరిస్తున్నట్టే కదా? వెన్నుపోటు దారుడైన చంద్రబాబు నాయకత్వంలో ఎలా పనిచేస్తున్నారు? వంటి ప్రశ్నలను అడగదలిచింది. తెలంగాణపై నిర్ణయం తీసుకుంటారని తెలిసీ ఆరోజు సమన్యాయం గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు? సీమాంధ్రలో ఉద్యమం తీవ్రతరమైన తొమ్మిది రోజుల తర్వాత ఎలా స్పందించారు? సమన్యాయం జరగలేదని చెబుతున్నప్పుడు అదే విషయాన్ని పార్లమెంట్‌లో టీడీపీ తెలంగాణ ఎంపీలు ఎందుకు ప్రశ్నించలేదు? వంటి ప్రశ్నలను అడిగి సమాధానం రాబట్టాలని సాక్షి భావించింది.