మలయాళీలంతా తెలంగాణీయులే | Kerala Bhavan Rapprochement In KCR | Sakshi
Sakshi News home page

మలయాళీలంతా తెలంగాణీయులే

Published Mon, Sep 21 2015 2:30 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

మలయాళీలంతా తెలంగాణీయులే - Sakshi

మలయాళీలంతా తెలంగాణీయులే

* తెలంగాణ ప్రజలతో సమానంగా అన్ని హక్కులు
* 350 పేద మలయాళీ కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇళ్లు
* కేరళ భవన్ శంకుస్థాపనలో కేసీఆర్  వరాల జల్లు
* మలయాళీలంతా తెలంగాణ అభివృద్ధి కోరుతున్నారు: చాందీ
* శబరిమలైలో భవనాల నిర్మాణానికి ప్రతి రాష్ట్రానికీ ఐదెకరాలు

సాక్షి, హైదరాబాద్: ‘హైదరాబాద్‌లో నివసిస్తున్న మలయాళీలంతా తెలంగాణీయులే. వారందరికీ తెలంగాణ ప్రజలతో సమానమైన హక్కులుంటాయి’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

జూబ్లీహిల్స్‌లో కేరళభవన్‌కు కేరళ సీఎం ఊమెన్ చాందీతో కలిసి ఆదివారం ఆయన శంకుస్థాపన  చేశారు. అనంతరం కాన్ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ రీజియన్ మలయాళీ అసోసియేషన్ శిల్పకళావేదికలో నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. హైదరాబాద్‌లో కేరళ భవన్‌కు ఎకరం స్థలం, నిర్మాణానికి రూ.కోటి కేటాయిస్తానని ఆర్నెల్ల క్రితం ఇచ్చిన హామీని ఇలా నిలబెట్టుకున్నానన్నారు. దేశంలోనే నంబర్‌వన్‌గా కేరళ భవన్‌ను నిర్మిస్తామన్నారు. తెలంగాణ అభివృద్ధికి అంతా కలసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.

తెలంగాణలో నిరక్ష్యరాస్యత నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టనున్న ప్రత్యేక కార్యక్రమంలో మలయాళీలను భాగస్వాములను చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. సీటీఆర్‌ఎంఏ గుర్తించి న 350 పేద మలయాళీ కుటుంబాలకు ప్రభుత్వం తరపున డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. ‘‘సంస్కృతి, సంప్రదాయలపరంగా కేరళకు గొప్ప నేపథ్యముందని, ప్రతి ఒక్కరితో త్వరగా కలసిపోవడం మలయాళీల గొప్పదనం. పెద్దగా లాభాన్ని ఆశించకుండా ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న గొప్ప వ్యక్తులు మలయాళీలు’’ అని కొనియాడారు.
 
సొంతరాష్ట్రంగా భావిస్తున్నారు..
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి మంచి జరగాలని మలయాళీల తరపున, కే రళ ప్రభుత్వం తరపున కోరుకుంటున్నానని చాందీ అన్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న మలయాళీలంతా తెలంగాణను తమ సొంత రాష్ట్రంగా భావిస్తున్నారన్నారు. ఇదే సంప్రదాయాన్ని, సత్సంబంధాలను కొనసాగించాలని వారికి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో కేరళభవన్‌కు ఎకరం స్థలం, రూ.కోటి ఇచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు.

శబరిమలైకి వచ్చే భక్తుల కోసం భవనాలు నిర్మించుకునేందుకు ప్రతి రాష్ట్రానికి ఐదేసి ఎకరాల చొప్పున కేరళ ప్రభుత్వం కేటాయిస్తోందని చెప్పారు. ఐదేళ్లుగా కేరళ కూడా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతోందని, వివిధ సంస్థలు తమ యూనిట్లను స్థాపించేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. పలు రంగాల్లో నిష్ణాతులైన మలయాళీలను ఈ సందర్భంగా ఇరువురు సీఎంలు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మంత్రులు నాయిని, జూపల్లి, పద్మారావు, జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీలు కేశవరావు, వీహెచ్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, శ్రీనివాసగౌడ్, రవీందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రెడ్డి, సీటీఆర్‌ఎంఏ అధ్యక్షుడు బెంజిమన్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement