చాయ్ అమ్ముతూ.. 17 దేశాలు చుట్టేశాడు!
రైల్వే స్టేషన్లో చాయ్ అమ్మకున్న దామోదర్ దాస్.. ఇప్పుడు దేశ ప్రధాని. బహుశా చాయ్వాలాగా ఉన్నప్పుడు.. ఈ స్థాయికి చేరుకుంటానని ఆయన ఊహించి ఉండరేమో! దాదాపు మోదీ సమకాలీకుడే అయిన విజయన్ మాత్రం బోలెడు కలలు కన్నాడు. వాటిలో చాలా వాటిని నెరవేర్చుకున్నాడు కూడా!
చాయ్ వాలాగా జీవితం ప్రారంభించిన విజయన్ ఒకప్పుడు.. చిన్న టీస్టాల్ ఓనర్. తన భార్యతో కలిసి.. భారత్ లోని అన్ని పర్యాటక ప్రాంతాలతో పాటు 17 విదేశాలూ చుట్టొచ్చాడు. విజయన్ 65 ఏళ్ల అనుభవం, 40 ఏళ్ల దాంపత్య జీవితం, 17 దేశాల పర్యటన అన్నింటినీ కలిపి 'ఇన్విజిబుల్ వింగ్స్' పేరుతో రూపొందించిన 9 నిమిషాల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. 'ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. కలలు నెరవేర్చుకోండి' అంటూ ఉత్సాహం రేకెత్తిస్తోంది.
కొచ్చి నగరం, గాంధీనగర్లోని సలీమ్ రాజన్ రోడ్డు.. ఎర్రటి గోడపై తెల్లటి అక్షరాలు.. 'శ్రీబాలాజీ కాఫీ హౌస్'. అలుపు లేకుండా వచ్చే కస్టమర్లకు అలసిపోకుండా కాఫీ, టీలు అందిస్తుంటాడు.. 65 ఏళ్ల విజయన్. పక్కనే చేదోడుగా ఆయన భార్య మోహన. పరిచయస్తులు, చుట్టుపక్కలవారి దృష్టిలో వాళ్లిద్దరూ 'కొద్దిగా తేడా మనుషులు'.
ఈ ఆరోపణపై విజయన్ వివరణ ఇస్తాడిలా.. 'మమ్మల్ని ఒక్కమాటైనా అనని వాళ్లు ఒక్కరూ లేరంటే అబద్ధం కాదు. టీస్టాల్ నడుపుకొనే మాకు.. విదేశీయానాలు అవసరమా? అనేది వారి ఆరోపణ. నా వరకైతే ప్రతి యాత్రా ఒక మలుపు. ఒక విజయం. ఎందుకంటే అది నా కల కాబట్టి' అని.
భారతదేశంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను చుట్టివచ్చిన విజయన్, మోహనలు 17 విభిన్నదేశాల అందాలనూ ఆస్వాదించారు. అమెరికా వెళ్లేందుకు మాత్రం వారికింకా అనుమతి లభించలేదు. కారణం.. ఆర్థిక స్థితి. యూఎస్ వీసా కోసం ఆస్తులు చూపించడం తప్పనిసరి. మరి విజయన్ ఆస్తి.. ఒక్క టీస్టాలే!
అయినాసరే, ఎప్పటికైనా అక్కడకు కూడా వెళతాననే ధీమాతో ఉన్నాడు విజయన్. ఎలా? అటే.. 'అదీ నా కలే కాబట్టి తప్పక నెరవేర్చుకుంటా' అంటాడు. విదేశీయానాల కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం, ఆనందం అనుభవించిన తర్వాత మూడు నాలుగు నెలలు రెట్టింపు కష్టంతో పనిచేసి అప్పు తీర్చడం ఈ వృద్ధ జంటకు అలవాటైన పని.