
కుల్దీప్‌పై కింగ్ ఆఫ్ స్పిన్ ప్రశంసల జల్లు!
ధర్మశాల: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో అరంగేట్రం చేసిన యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తొలి మ్యాచ్‌లోనే వీరోచిత ప్రతిభతో పర్యాటక జట్టును మట్టికరిపించాడు. ‘చైనామన్’ బౌలింగ్‌తో కంగారులను కూల్చిన కుల్దీప్.. తన స్పిన్‌ను మెరుగుపరుచుకోవడానికి స్పిన్ బౌలింగ్ దిగ్గజం, ఆస్ట్రేలియా లెజండరీ క్రికెటర్ షేన్ వార్న్ నుంచి సలహాలు పొందినట్టు తెలిపాడు. వార్న్ ఇచ్చిన టిప్స్ ఆసిస్‌ను దెబ్బతీయడంలో బాగా పనికొచ్చాయని చెప్పాడు.
మొదటి టెస్టులోనే అద్భుతంగా రాణించిన కుల్దీప్ గురించి తాజాగా కింగ్ ఆఫ్ స్పిన్ షేన్ వార్న్ స్పందించాడు. అతని బౌలింగ్, స్పీన్ చాలా ఇంప్రెసివ్‌గా ఉన్నాయంటూ కొనియాడాడు. 'ఏ దేశానికి చెందిన ఏ యువ స్పిన్నర్‌కైనా సహాయమందించడానికి నేను ఆనందంగా ముందుకొస్తాను. మణికట్టుతో బౌలింగ్ చేసే స్పిన్నర్లు వర్ధిల్లాలి. కుల్దీప్ అద్భుతంగా ఆడావు' అంటూ వార్న్ ట్వీట్ చేశాడు.
ధర్మశాలలో కుల్దీప్ యాదవ్ సంధించిన ‘చైనామన్’ శైలిని ఎదుర్కోలేక.. అర్థం చేసుకోలేక ఆ జట్టు కంగారు పడిన సంగతి తెలిసిందే. తొలి సెషన్‌లో తుఫాన్ వేగంతో పరుగులు నమోదుచేసిన ఆసిస్.. తొలి టెస్టు ఆడుతున్న 22 ఏళ్ల కుర్రాడు విసిరిన బంతుల ముందు ప్రత్యర్థి తడబడింది. ఒక దశలో 144/1తో భారీ స్కోరు దిశగా సాగిపోతున్నట్లు అనిపించిన కంగారూలు కుల్దీప్ జోరుకు తలవంచారు. కుల్దీప్ అద్భుతంగా రాణించి.. 68 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు.