
కింగ్‌ఫిషర్ పునరుద్ధరణ కష్టమే!
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంతో కుప్పకూలిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్.. పునరుద్ధరణ ప్రణాళికలకు ఆ కంపెనీ సొంత ఆడిటర్లే రెడ్ సిగ్నల్స్ చూపుతున్నారు. భవిష్యత్తులో మళ్లీ కార్యకలాపాలను ప్రారంభించే సామర్థ్యం ఉన్న(గోయింగ్ కన్‌సర్న్) కంపెనీగా ప్రకటించుకోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. వేల కోట్ల రూపాయల రుణాలు బకాయిపడటం, భారీ స్థాయిలో నష్టాలు పోగైనాకూడా ఎలా పునరుద్ధరించగలరో అర్థంకావడం లేదని, ఇది అసాధ్యమని ఆడిటర్లు తమ నివేదికలో పలు అనుమానాలను వ్యక్తం చేశారు. అసలు పునరుద్ధరణ ప్రణాళికలో స్పష్టతే లేదని తేల్చిచెప్పారు. మరోపక్క, కింగ్‌ఫిషర్ మాతృ సంస్థ యూబీ బ్రూవరీస్(హోల్డింగ్) ఆడిటర్లు కూడా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కింగ్‌ఫిషర్‌లో యూబీ బ్రూవరీస్‌కు రూ.14,000 కోట్ల మేర పెట్టుబడులు ఉన్నాయి. విజయ్ మాల్యాకు చెందిన యూబీ గ్రూప్‌లో ఈ కంపెనీలు భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి వ్యాపారం నిలిచిపోయినా.. భవిష్యత్తులో దివాలా ముప్పులేదనే భరోసాతో ఆర్థిక ఫలితాలను ప్రకటించడం ఇతరత్రా కార్యకలాపాలను చేపట్టే సంస్థలను ‘గోయింగ్ కన్‌సర్న్’గా వ్యవహరిస్తారు.
కింగ్‌ఫిషర్ ఇప్పటిదాకా ఒక్క పూర్తి ఏడాదిలోకూడా లాభాలను ప్రకటించలేదు. అంతేకాదు కంపెనీ మొత్తం నష్టాలు రూ.17,000 కోట్లకు పేరుకుపోయాయి. ఇక బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలు రూ.6,000 కోట్లకు పైమాటే. ఇవన్నీ మొండిబకాయిలుగా మారిపోయాయి. వీటిని రాబట్టుకోవడానికి బ్యాంకులు కింగ్‌ఫిషర్ ఆస్తులను విక్రయించే పనిలో ఉన్నాయి. మరోపక్క, విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ కంపెనీ ఫ్లయింగ్ పర్మిట్‌ను రద్దుచేసింది కూడా. దీన్ని తిరిగి రెన్యువల్ చేయాలంటే సవివర పునరుద్ధరణ ప్రణాళిక, కొత్తగా నిధులను వెచ్చించడం, రుణాల పునర్‌వ్యవస్థీకరణ వంటివి చాలా అవసరమని ఆడిటర్లు అంటున్నారు. ఇవేమీ లేకుండానే ‘గోయింగ్ కన్‌సర్న్’ కంపెనీగా ఎలా ప్రకటిస్తారని, అసలు కంపెనీని పునరుద్ధరించడం అసాధ్యమని కూడా పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి కంపెనీ రూ.1,157 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఇక మార్చి చివరినాటికి కంపెనీ నెట్‌వర్త్ మైనస్ రూ.1,292 కోట్లకు పడిపోవడం గమనార్హం. కార్యకలాపాలేవీ లేకపోయినా.. సిబ్బంది, విమానాల లీజు రెంటల్స్, ఇతర నిర్వహణ వ్యయాలను ఫలితాల్లో చూపుతుండటం గమనార్హం.