ఆదిభట్ల ఇక స్పేస్ సిటీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సమూహ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ హైదరాబాద్ సమీపంలో ఆదిభట్ల వద్ద ఏర్పాటు చేసిన సమూహ ఏరోస్పేస్ పార్కుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో ప్రపంచంతో పోటీపడి సత్తా చాటిన కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయని ఆయన కితాబిచ్చారు. ఆదిభట్ల ప్రాంతాన్ని స్పేస్ సిటీగా నామకరణం చేస్తామన్నారు. వచ్చే 15 ఏళ్లలో భారత్‌లో డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో 500 బిలియన్ డాలర్ల విలువైన వ్యాపారావకాశాలు ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ శాస్త్ర సలహాదారు అవినాష్ చందర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ అవకాశాలు 10-15 రెట్లు ఉంటాయని చెప్పారు. ఆఫ్‌సెట్ పాలసీ కింద భారతీయ కంపెనీలకు ఆర్డర్లు పెరుగుతున్నాయని వివరించారు. కాగా, పార్కు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 30 వేల మందికి ఉపాధి లభించనుంది.
బలంగా ఎదిగాం..
ఐదేళ్లలో సమూహ ఇంజనీరింగ్ రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టనుందని ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ జయేష్ రంజన్ తెలిపారు. చిన్న కంపెనీలు క ్లస్టర్‌గా ఏర్పాటయ్యేదుకు ఏపీఐఐసీ సాయపడుతుందని అన్నారు. టర్నోవర్ తక్కువగా ఉండడంతో పూర్తి అవకాశాలు దక్కడం లేదని సమూహ ఇంజనీరింగ్ చైర్మన్, ఎంటీఏఆర్ టెక్నాలజీస్ చైర్మన్ రవీంద్రా రెడ్డి అన్నారు. ప్రస్తుతం 27 కంపెనీలతో బలమైన కంపెనీగా సమూహ ఏర్పడిందని తెలిపారు. మరింతమంది సభ్యులతో మరో పార్కును ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మరో 100 కంపెనీలు ఇక్కడికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని, ఇందుకు అదనంగా స్థలం కేటాయించాలని ఏపీఐఐసీని కోరినట్టు సమూహ ఈడీ శ్రీరామ్ ఎంఎం వెల్లడించారు. సమూహ ఎగ్జిక్యూటివ్ మెంబర్, ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్ ఎండీ డి.విద్యాసాగర్ మాట్లాడుతూ పీఎస్‌ఎల్‌వీ-సీ25 తయారీలో సమూహ కంపెనీల పాత్ర కూడా ఉందన్నారు.
గీతలు గీసుకుంటున్నాం..
సమైక్యవాదాన్ని వినిపించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్ని వేదికలనూ సద్వినియోగం చేసుకుంటున్నట్టు ఉంది. ‘ఒకపక్క మన రాష్ట్రం నుంచి (నెల్లూరు జిల్లా శ్రీహరికోట) రాకెట్లు నింగికి దూసుకెళ్తున్నాయి. మరోపక్క మనం గీతలు గీసుకుంటున్నాం’ అని అన్నారు. పరోక్షంగా రాష్ట్ర విభజన వద్దని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.