
‘కత్తి’లాంటి మసాజ్
చాలా రకాల మసాజ్‌లను మనం చూశాం.. కానీ ఇలాంటిది ఎక్కడైనా చూశామా? మటన్ కత్తులతో మసాజ్.. కీమా కొట్టినట్లు లయబద్ధంగా మన శరీరంపై అవి నాట్యం
చాలా రకాల మసాజ్‌లను మనం చూశాం.. కానీ ఇలాంటిది ఎక్కడైనా చూశామా? మటన్ కత్తులతో మసాజ్.. కీమా కొట్టినట్లు లయబద్ధంగా మన శరీరంపై అవి నాట్యం చేస్తుంటే..కొందరికైతే.. టెన్షన్ తగ్గడానికి బదులు మరింత పెరుగుతుందేమో.. ఈ కత్తిలాంటి మసాజ్ మీకూ కావాలంటే తైవాన్‌లోని తైపీకి వెళ్లాల్సిందే.. అక్కడ హియో మీ ఫాంగ్ అనే మహిళ తమ సెంటర్లో ఈ చిత్రమైన మర్దన కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. 2,500 ఏళ్ల క్రితం నుంచి ఈ తరహా మర్దన కార్యక్రమం ఉందట.
చైనాలో ఫస్ట్ టైం చేశారట. తొలుత చాలా మంది ఇదేదో సరదా కోసం చేస్తున్నదని భావించినా.. మసాజ్ పూర్తయిన తర్వాత దాని ఫలితాలను చూశాక.. ఇది చేయించుకోవాలని తమకు తెలిసినవారికి సిఫార్సు చేస్తున్నారని ఆమె తెలిపారు. దీని వల్ల కణాలు పునరుజ్జీవం కావడంతోపాటు శరీరం అంతా రిలాక్స్‌గా అయిపోతుందని చెప్పారు. ఇది చేయించుకున్నప్పుడు శరీరంలో కరెంటు ప్రవహిస్తున్నట్లు అనిపించిందని ఓ వ్యక్తి తెలిపారు. దీని వల్ల తన మెడనొప్పి తగ్గిందన్నారు.