
నికరంగా వచ్చేది 442 టీఎంసీలే!
ఇప్పటివరకు సరైన వర్షాలు కురవని సమయాల్లోనే ఇబ్బందులను ఎదుర్కొంటున్న రాష్ట్ర రైతులకు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అసలైన నీటికష్టాలను చూపించనుంది.
వర్షాలు ఓ మోస్తరుగా కురిసినా కృష్ణా ఆయకట్టు ఎడారే
భారీ వరదలు వస్తేనే... ఇక రాష్ట్రానికి నీరు
బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వస్తే జరిగేది ఇదే
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు సరైన వర్షాలు కురవని సమయాల్లోనే ఇబ్బందులను ఎదుర్కొంటున్న రాష్ట్ర రైతులకు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అసలైన నీటికష్టాలను చూపించనుంది. ఈ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వస్తే మంచి వర్షాలు కురిసినా నీటి కష్టాలను ఎదుర్కొనక తప్పదు. మనకు కేటాయించిన 1,005 టీఎంసీల్లో 442 టీఎంసీలు దిగువకు వదిలిన తర్వాత ఎగువ రాష్ట్రాలు మిగిలిన నీటిని కూడా వాడుకునే విధంగా ట్రిబ్యునల్ తీర్పును ఇచ్చింది. ఈ నిబంధన కారణంగా జనవరివరకు రాష్ట్రంలోకి నీటి రాకను ఎగువ రాష్ట్రాలు అడ్డుకునే ప్రమాదం ఉంది. ఫలితంగా రాష్ట్రంలో పంటలకు నీరు కరువై ఎడారిగా మారే ప్రమాదం ఉంది. కృష్ణా నదిలో మొత్తం 2,578 టీఎంసీలు నీరు ఉన్నట్టు బ్రిజేశ్‌కుమార్ అంచనా వేసిన విషయం తెలిసిందే.
ఇందులో 75 శాతం డిపెండబులిటీ అంచనా ప్రకారం (బచావత్ ట్రిబ్యునల్) 2,130 టీఎంసీలు కాగా, 65 శాతం డిపెండబులిటీ అంచనా ప్రకారం 1,630 టీఎంసీలు, మిగులు (సరాసరి) జలాల కింద మరో 285 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్టు గుర్తించారు. ఇందులో మన రాష్ట్రానికి 1,005 టీఎంసీలు, కర్ణాటకకు 907 టీఎంసీలు, మహారాష్ర్టకు 666 టీఎంసీల నీటిని కేటాయించారు. ఈ పద్ధతి అమల్లోకి వస్తే మనకు కేటాయించిన 1,005 టీఎంసీల్లో ఎగువ నుంచి నికరంగా 442 టీఎంసీల నీరే రానుంది. 75 శాతం డిపెండబులిటీ ప్రకారం అంచనా వేసిన 2,130 టీఎంసీలను ముందుగా ఉపయోగించుకోవాలని ట్రిబ్యునల్ అన్ని రాష్ట్రాలకు సూచించింది. పైగా ఎగువ రాష్ట్రాలు తమ కోటా మేర ఉపయోగించుకున్న తర్వాతే దిగువకు నీటిని విడుదల చేయాలని పేర్కొంది.
అంటే ఈ 2,130 టీఎంసీల్లో మనకు 811 టీఎంసీలు రావాల్సి ఉంది. అయితే.. ఈ 811 టీఎంసీల నీటిలో మన రాష్ట్ర పరిధిలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురిసే వర్షాల ద్వారా 369 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్టు ట్రిబ్యునల్ అంచనా వేసింది. అంటే మన దగ్గర లభ్యమయ్యే 369 టీఎంసీలను 811 టీఎంసీల నుంచి పక్కన పెడితే... మిగిలిన 442 టీఎంసీలే ఎగువ ప్రాంతం నుంచి వస్తాయి. కానీ మన వద్ద వర్షాలు రాకపోతే మనకు దక్కే నీరు 442 టీఎంసీలే. మనకు ఈ మేరకు నీటిని విడుదల చేసిన తర్వాత ఎగువ రాష్ట్రాలు మిగిలిన (65 శాతం డిపెండబులిటి లభ్యత) నీటిని వాడుకునే అవకాశం ఉంది. ఈ మేరకు ట్రిబ్యునల్ తన తీర్పులో స్పష్టంగా పేర్కొంది. అయితే జనవరి (వింటర్ మాన్‌సూన్ ముగిసిన తర్వాత) మాసం వరకు కూడా మనకు కేటాయించిన కోటా మేర నీరు రాకపోతే బోర్డు దృష్టికి తీసుకురావచ్చని మాత్రం చెప్పింది. అంటే... జనవరి మాసం వరకు నీటి విడుదలకు సంబంధించి ఎగువ రాష్ట్రాలపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేని పరిస్థితి ఏర్పడింది.
కృష్ణానదిలో జనవరి మాసం వచ్చే నాటికి నీటి ప్రవాహం గణనీయంగా పడిపోనుంది. మన రాష్ర్టంలో కురిసే వర్షాల ద్వారా 369 టీఎంసీలు రాకపోతే... జనవరి తర్వాత బోర్డుకు ఫిర్యాదు చేసినా... పెద్దగా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆ సమయానికి ఎగువ ప్రాంతాల్లో కూడా నీటి లభ్యత తగ్గిపోతుంది. ఫలితంగా దిగువకు నీటిని విడుదల చేయడం సాధ్యం కాదు. పైగా కర్ణాటకలోని ఆలమట్టి, మహారాష్ర్టలోని కోయినా వంటి ప్రస్తుత ప్రాజెక్టులకు నీటి కోటాను ట్రిబ్యునల్ పెంచింది. ఆ తీర్పు అమల్లోకి వచ్చిన వెంటనే వారి వాడకం గణనీయంగా పెరిగిపోనుంది. ఒక్క ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపుతోనే ఏకంగా 130 టీఎంసీల నీటిని అదనంగా కర్ణాటక ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే ఉన్న 173 టీఎంసీల నీటి వాడకాన్ని కర్ణాటక ప్రభుత్వం ఏకంగా 303 టీఎంసీలకు పెంచుకోనుంది. దాంతో దిగువకు వచ్చే నీటి ప్రవాహం గణనీయంగా తగ్గిపోనుంది.