ఎంతయినా తెలుగు వాళ్లం కదా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ) జాతీయ ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలు మొదటి ర్యాంకులో నిలవడంపై తెలంగాణ పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవే ర్యాంకులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆన్ లైన్ లో పొందుపర్చిన సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చోరీ చేసిన వ్యవహారం గతంలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
తెలంగాణ ప్రభుత్వ విధానాలను ఆంధ్రప్రదేశ్ కాపీ కొట్టిందంటూ గతంలో కేంద్రానికి ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనన్న కేటీఆర్.. ప్రపంచవ్యాప్తంగా మేథో సంపత్తి రక్షణపై ఆందోళన వ్యక్తమవుతోందని వ్యాఖ్యానించారు. 'ఏపీ కాపీ కొట్టిన వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేశాం. అయితే.. ఒకటి మాత్రం వాస్తవం.. మొదటి ర్యాంకు ర్యాంకు ఎవరితో పంచుకుంటారని ఒకవేళ కేంద్రం అడిగిఉంటే మేం ఆంధ్రప్రదేశ్‌నే ఎంచుకునేవాళ్లం. ఎంత కాదన్నా ఇన్నాళ్లు కలిసి ఉన్నాం. తెలుగు వాళ్లం కదా!' అని కేటీఆర్ అన్నారు. (తప్పక చదవండి: ఏపీ.. కాపీ)
హైదరాబాద్ లో మంగళవారం విలేకరులతో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. తెలంగాణకు నెంబర్ వన్ ర్యాంక్ దక్కడం ఆషామాషీ వ్యవహారందని, దీనివెనుక 9 నెలల కష్టముందని చెప్పారు. పారిశ్రామిక రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు తెచ్చామని, అన్ని శాఖల మధ్య సయోధ్య, సమన్వయంతోనే మొదటిర్యాకు కైవసం అయిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా విధానం, రాష్ట్రం ప్రగతి తీరుకు దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో అవార్డులు వచ్చాయని గుర్తుచేశారు. ర్యాంకులతో పొంగిపోకుండా అవినీతి రహితంగా వ్యవహరించాలనే కేసీఆర్ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూ నాణ్యమైన సేవలందిస్తామన్నారు.