తొమ్మిది నెలల కష్టానికి ఫలమిది
► ఈవోడీబీ ర్యాంకుపై కేటీఆర్
► 22 చట్టాలను సవరించాం..
► 58 జీవోలిచ్చాం
► అన్ని శాఖలతో 66 సార్లు సమావేశాలు నిర్వహించాం
► విప్లవాత్మక సంస్కరణలతోనే
► ఈ విజయం వచ్చిందన్న మంత్రి
► అన్ని శాఖల అధికారులకు అభినందనలు
సాక్షి, హైదరాబాద్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ)లో తెలంగాణకు నంబర్ వన్ ర్యాంకు రావడం ఆషామాషీ వ్యవహారం కాదని.. దాని వెనుక 9 నెలల కష్టముందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు చెప్పారు. పారిశ్రామిక రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు ప్రవేశపెట్టడం.. అన్ని శాఖల మధ్య సయోధ్య, సమన్వయంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో ఐఏఎస్ అధికారులు అరవింద్‌కుమార్, నవీన్ మిట్టల్, శాంతికుమారి, అహ్మద్ నదీం, అనిల్‌లతో కలసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.‘‘తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో పెట్టుబడులు ఎలా వస్తాయి, రాష్ట్రం ఎలా ముందుకెళుతుందని చాలామంది సందేహం వ్యక్తం చేశారు. ఇప్పుడు తెలంగాణకు పారిశ్రామికంగా అగ్రస్థానం దక్కడంతో ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. సీఎం కేసీఆర్ పాలనా విధానం, రాష్ట్ర ప్రగతి తీరుకు దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో అవార్డులు వచ్చాయి’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఎన్నో చర్యలు తీసుకున్నాం
ఈవోడీబీ ర్యాంకు రావడానికి చాలా చర్యలు చేపట్టామని కేటీఆర్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రపంచమంతా అబ్బురపడేలా టీఎస్ ఐపాస్ విధానాన్ని తెచ్చామన్నారు. ‘‘గత తొమ్మిది నెలలుగా 66 సార్లు రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహించాం. 22 శాఖలను సమన్వయపరిచాం. ఏకంగా 22 చట్టాలను సవరించాం. 58 జీవోలిచ్చాం. 121 సర్క్యులర్లు జారీ చేశాం. 113 ఆన్‌లైన్ సేవలను ప్రారంభించాం. 19 పోర్టల్స్‌ను అప్‌డేట్ చేశాం. కేంద్రం అడిగిన 340 అంశాలకుగాను 324 సంస్కరణలు చేపట్టాం. 12 అంశాలు తెలంగాణకు వర్తించవు. నాలుగు అంశాలను మాత్రమే కేంద్రం ఆమోదించలేదు. ఫలితంగా 98.78 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగలిగాం..’’అని కేటీఆర్ వివరించారు. 15 రోజుల్లో అనుమతులివ్వకుంటే ఆటోమేటిక్‌గా అనుమతి లభించేలా ‘స్వీయ ధ్రువీకరణ పత్రం’ జారీ చేయడంతో పాటు ఫ్యాక్టరీల తనిఖీ విధానంలోనూ సంస్కరణలు తెచ్చామని చెప్పారు. ఐదేళ్ల కాలంలో ఒక ఫ్యాక్టరీని 30 సార్లు తనిఖీ చేసేవారని, ఆ విధానాన్ని మార్చేసి పెద్దగా ప్రమాదకరం కాని పరిశ్రమల్లో ఐదేళ్లకు ఒకసారి మాత్రమే తనిఖీలు చేసేలా నిబంధనలు రూపొందించామని తెలిపారు. రిజిస్టర్ల నిర్వహణ, అనుమతులు, రెన్యూవల్‌లను పూర్తిగా సరళీకరించామన్నారు. పరిశ్రమలు, కార్మిక శాఖలతోపాటు వివిధ శాఖల అధికారుల కృషి వల్లే ఇది సాధ్యమైందంటూ ఆయా శాఖల అధికారులకు అభినందనలు తెలిపారు. ఈ విషయంలో నిర్మాణాత్మక సలహాలిచ్చిన కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ర్యాంకులతో పొంగిపోకుండా అవినీతి రహితంగా వ్యవహరించాలనే కేసీఆర్ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తామని, ఉత్తమ సేవలు అందిస్తామని పేర్కొన్నారు.
ఏపీ కాపీ కొట్టినా.. ర్యాంకు పంచుకోవడం సంతోషమే
తెలంగాణ ప్రభుత్వ విధానాలను ఆంధ్రప్రదేశ్ కాపీ కొట్టిందంటూ గతంలో కేంద్రానికి ఫిర్యాదు చేసిన అంశాన్ని మీడియా ప్రస్తావించగా... ఏపీ కాపీ కొట్టినా ర్యాంకు పంచుకోవడం సంతోషమేనని కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా మేధో సంపత్తి రక్షణపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీ కాపీ కొట్టిన వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేశాం. అయితే ఒకటి మాత్రం వాస్తవం. ర్యాంకు ఎవరితో పంచుకుంటారని ఒకవేళ కేంద్రం అడిగితే మేం ఏపీనే ఎంచుకునేవాళ్లం. ఎంత కాదన్నా ఇన్నాళ్లు కలసి ఉన్నాం. తెలుగు వాళ్లం కదా..’’ అని వ్యాఖ్యానించారు. సర్వేలు, ర్యాంకులన్నీ బోగస్ అంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు. ప్రైవేటు సంస్థలు సర్వేలు చేస్తే బోగస్ అన్నారని.. మరి ఇప్పుడు కేంద్రమే ర్యాంకు ఇచ్చిందని, ప్రధాని మోదీ కూడా కేసీఆర్‌ను మెచ్చుకున్నారు కదాని కేటీఆర్ గుర్తు చేశారు. కేంద్రంలో తాము భాగస్వామి కూడా కాదని, అయినా నోరుపారేసుకుంటే ఏం చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్ల అజ్ఞానానికి జాలిపడటం తప్ప ఏమీ అనలేమని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న వాటిలో తెలంగాణకు కొద్దిమేర ఇన్సెంటివ్‌లు వచ్చాయని, మిగతా వాటిపై త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామంటూ అరుణ్‌జైట్లీ హామీ ఇచ్చారని తెలిపారు.