ఎల్ కె అద్వానీ
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ ఆరోపించారు. తెలంగాణ అంశం వల్లే పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు సందర్భంగా గురువారం పార్లమెంట్లో చోటు చేసుకున్న ఘటనలు పార్లమెంట్ ప్రతిష్టను దిగజార్చాయని అద్వానీ ఆవేదన వ్యక్తం చేశారు.
సాక్షాత్తు కేంద్ర మంత్రులే లోక్సభ వెల్లోకి దూసుకురావడం తమను తీవ్ర దిగ్భ్రాంతిని కలగించిందన్నారు. ఆ రోజు జరిగిన ఘటనలో ఎంపీల ప్రవర్తన మరింత శృతిమించిందని ఎల్ కె అద్వానీ పేర్కొన్నారు. పెప్పర్ స్ప్రే వల్ల తమ పార్టీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ కళ్ల వెంట నీళ్లు వచ్చాయని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేశామని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు.
ఆ సమయంలో మూడు రాష్ట్రాల ప్రజలు ఎక్కడ ఎటువంటి గొడవలు పడ లేదన్నారు. దాంతో ఆ రాష్ట్రాలను సామరస్య పూర్వకంగా విభజించామని తెలిపారు. అందుకు అయా రాష్ట్రాల ప్రజలు సహకరించడమే కాకుండా ఎంతో సంతోషించారని చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజల మధ్య గొడవలు సృష్టించి విభజిస్తుందని ఎల్ కె అద్వానీ పేర్కొన్నారు.