లోకసభలో మిరియాల పొడి స్పే చేసిన లగడపాటి
విజయవాడ: విభజన బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ సీమాంధ్ర ఎంపీలు గందరగోళం సృష్టించారు. నిరసనలు, ఆందోళనలతో హోరెత్తించారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కలకలం రేపారు. సభలో మిరియాల పొడి స్ప్రే చేశారు. దీంతో ఒక్కసారిగా సభలో అయోమయం నెలకొంది.
మంటలు వస్తాయనే భయంతో సభ్యులు బయటకు పరుగులు తీశారు. కళ్లలోంచి నీళ్లు, దగ్గు రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడిపోయారు. అక్కడితో ఆగకుండా కంప్యూటర్ను లగడపాటి ధ్వంసం చేశారు. పెప్పర్ స్ప్రే తో ఇబ్బందులకు గురైన ఎంపీలను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. సభలో పెప్పర్ స్ప్రే చేసిన లగడపాటిని అరెస్ట్ చేసే అవకాశముందని చెబుతున్నారు.
టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మైకులు విరిచేశారు. ఆయనను తెలంగాణ టీడీపీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, రమేష్ రాథోడ్ అడ్డుకునే యత్నం చేశారు. ఇరుప్రాంతాల నేతలు బాహాబాహికి దిగారు.