విజయవాడ ఎంపీ లగడపాటి రాజ గోపాల్ మరోసారి మీడియాపై చిందులు తొక్కారు. ప్రశ్నించిన విలేకర్లను మీ అంతు చూస్తానని బెదిరించారు.
మీడియా ప్రతినిధులపై లగడపాటి చిందులు
సాక్షి, న్యూఢిల్లీ: విజయవాడ ఎంపీ లగడపాటి రాజ గోపాల్ మరోసారి మీడియాపై చిందులు తొక్కారు. ప్రశ్నించిన విలేకర్లను మీ అంతు చూస్తానని బెదిరించారు. బుధవారం రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందానికి లేఖ రాసిన లగడపాటి ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్‌లో అల్లకల్లోలం జరుగుతుందని వ్యాఖ్యానించారు.
‘అల్లకల్లోలం ఎవరు చేస్తారు?’ అని ఇద్దరు విలేకరులు ప్రశ్నించారు. దీనికి సరైన సమాధానమివ్వని లగడపాటి.. సమావేశం తర్వాత వారితో వాగ్వాదానికి దిగారు. అవివేకంగా మాట్లాడొద్దంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ప్రశ్నలు అడిగితే అవివేకం అంటారేమిటి?’ అని సదరు విలేకరులు ప్రశ్నించారు. దీంతో లగడపాటి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘‘నోర్ముయ్... నీ పేరేంటి? నీ ఏరియా ఏంటి?’’ అంటూ ఊగి పోయారు. ‘‘అవసరమైతే చేతులు లేస్తాయి’’ అంటూ చిందులుతొక్కారు. తన వాహనం ఎక్కుతూ.. అసభ్య పదజాలంతో దూషిస్తూ.. ‘‘నా సంగతేంటో చూపి స్తా... మీ అంతు చూస్తా!’’ అని నిష్ర్కమించారు.