భూసేకరణపై పార్లమెంటరీ కమిటీకి తెలిపిన
అకాలీదళ్, స్వాభిమాని పక్ష పార్టీలు
అంగీకారం లేకుంటే అంగుళం కూడా సేకరించొద్దు
70 శాతం రైతుల అనుమతి ఉండాలని ఇప్పటికే తెలిపిన శివసేన
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన భూసేకరణ బిల్లుపై ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సవరణ బిల్లులో మార్పులు చేయాల్సిందేనని శివసేన ఇప్పటికే స్పష్టంచేయగా.. తాజాగా శిరోమణి అకాలీదళ్(ఎస్‌ఏడీ), స్వాభిమాని పక్ష పార్టీలు అదే తీరులో స్పందించాయి. ఈ బిల్లు ప్రస్తుతం పార్లమెంట్ సంయుక్త కమిటీ పరిశీలనలో ఉంది. భూసేకరణకు 70 శాతం రైతుల అనుమతి తప్పనిసరి చేస్తూ బిల్లులో నిబంధన చేరిస్తేనే మద్దతిస్తామని శివసేన ఇప్పటికే బీజేకి స్పష్టంచేసింది. రైతులు ఒప్పుకోనిదే అంగుళం భూమి కూడా సేకరించకూడదని అకాలీదళ్, స్వాభిమాని పక్ష పార్టీలు తాజాగా ఎస్‌ఎస్ అహ్లూవాలియా నేతృత్వంలోని సంయుక్త కమిటీకి నివేదించాయి.
అకాలీ తరఫున నరేశ్ గుజ్రాల్, బల్విందర్ సింగ్ భుందర్, సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా, ప్రేంసింగ్ చందుమాజ్రా, షేర్ సింగ్ గుబాయలు కమిటీకి లిఖిత పూర్వకంగా తమ అభిప్రాయం తెలిపారు. రైతులకు భూమి అనేది అమూల్యమైనదిగా తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు/భూయజమానుల అనుమతి లేనిదే అంగుళం భూమి కూడా సేకరించొద్దని అన్నారు. సర్కారు ప్రాజెక్టులకు మాత్రమే ప్రభుత్వం భూసేకరణ జరిపేలా చూడాలన్నారు. రైతులు కోర్టుకు వెళ్లే హక్కును ఎట్టిపరిస్థితుల్లోనూ నిరాకరించవద్దని సూచించారు. పరిహారాన్ని భూయజమానులకే కాకుండా ఆ భూమిపై ఆధారపడే కూలీలకు కూడా ఇవ్వాలన్నారు.
భూసేకరణకు 70 శాతం రైతుల అభిప్రాయం తప్పనిసరి చేయడంతోపాటు పీపీపీ ప్రాజెక్టుల కోసం భూమి సేకరిస్తే ఐదు రెట్ల పరిహారం ఇవ్వాలని స్వాభిమాని పక్ష పార్టీ ఎంపీ రాజుషెట్టీ సూచించారు. ప్రస్తుత బిల్లులో ఈ పరిహారం నాలుగు రెట్లు మాత్రమే ఉంది. ఎన్డీఏలో బీజేపీ తర్వాత అతిపెద్ద భాగస్వామ్య పార్టీ అయిన శివసేనకు లోక్‌సభలో 18 మంది, రాజ్యసభలో ముగ్గురు సభ్యులున్నారు. శిరోమణి అకాలీదళ్‌కు లోక్‌సభలో నలుగురు, రాజ్యసభలో ముగ్గురు సభ్యులున్నారు. ఇక స్వాభిమాని పక్ష తరఫున రాజుషెట్టీ ఒక్కరే లోక్‌సభలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
రైతుల అనుమతి ఉండాల్సిందే
Published Thu, Jul 2 2015 1:40 AM | Last Updated on Mon, Oct 1 2018 2:27 PM
Advertisement
Advertisement