రేప్‌పై విద్యార్థినులకు ఎమ్మెల్యే వికృత ప్రశ్నలు!
అత్యాచార ఘటనపై ఓ బిహార్ ఎమ్మెల్యే విద్యార్థినులతో అత్యంత మొరటుగా వ్యవహరించారు. తానే పోలీసు అవతారం ఎత్తి ఇంటరాగేషన్ చేపట్టిన సదరు నాయకుడు ‘ఆమె రేప్‌కు గురైందని ఎలా చెప్తారు? రక్తం ఎక్కడి నుంచి వస్తుంది?’ అంటూ ప్రశ్నించారు. బీజేపీ మిత్రపక్షమైన కేంద్రమంత్రి ఉపేంద్ర కుశ్వాహ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ సమతాపార్టీ ఎమ్మెల్యే లలన్ పాశ్వాన్ ఇలా వికృత ప్రశ్నలు అడిగి విద్యార్థినులను ఇబ్బంది పెట్టారు.
బిహార్‌లోని వైశాలీలో ప్రభుత్వ హాస్టల్‌లో చదువుకునే ఓ పదో విద్యార్థిని అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయింది. ఆమె దుస్తులు రక్తంలో తడిసిపోయాయి. ఈ ఘటన నేపథ్యంలో హాస్టల్‌కు వచ్చిన ఎమ్మెల్యే పాశ్వాన్ తానే స్వయంగా విద్యార్థులను ప్రశ్నించి.. ఇంటరాగేషన్ మొదలుపెట్టారు. అభ్యంతరకరమైన ప్రశ్నలు అడిగిన ఆయన.. ’మీరు విద్యార్థులు. మీకు స్పష్టంగా సమాధానం చెప్పాలి. ఇప్పుడు మీరు స్పష్టంగా చెప్పలేకపోతే.. రేపు మీపై అత్యాచారం జరగొచ్చు. రేపిస్టు మీ గదికే వస్తే మీరు ఏం చేస్తారు’ అంటూ ఆయన విద్యార్థినులపై ప్రశ్నల వర్షం కురిపించారు. రేపిస్టు కొంతమంది అమ్మాయిలకు తెలిసివాడే కావొచ్చునంటూ డిటెక్టివ్ అవతారం కూడా ఎత్తారు. ఇలా అందరి ముందు ఎమ్మెల్యే అడిగిన వికృత ప్రశ్నలకు విద్యార్థినులు బెదిరిపోయారు. ఆ తర్వాత ఉపాధ్యాయుల వైపు తిరిగి మీలో కూడా కొందరు రేపిస్టుకు సాయం చేసి ఉండవచ్చునని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగుచూడటం దుమారం రేపుతోంది. కొత్త సంవత్సరం సందర్భంగా బెంగళూరులో జరుగుతున్న కీచక పర్వం నేపథ్యంలో మహిళలు, అమ్మాయిల పట్ల మొరట ప్రవర్తన చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే, తన తీరును సమర్థించుకున్న ఎమ్మెల్యే లలన్ పాశ్వాన్ తన ప్రశ్నల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదంటూ చెప్పుకొచ్చారు.