ఎన్నికల షెడ్యూల్ కు సిద్ధంకండి!
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు త్వరలోనే నగరా మోగనుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ ఈ ఐదు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. తమ పోల్ షెడ్యూల్ ప్రకటనకు సిద్ధంగా ఉండాలని సూచించింది. షెడ్యూల్ ప్రకటన రాగానే ప్రవర్తన నియమావళి అమలుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
ఎన్నికలు జరగనున్నఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల కేబినెట్ కార్యదర్శులు, రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు ఈసీ లేఖ రాసింది. జనవరి 4వ తేదీన ఈ పోల్ షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ లో ఏడు దశలుగా యూపీ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఒకరోజు ఎన్నికల జరగనున్నట్టు అధికారిక వర్గాల సమాచారం.
ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నిబంధనల జాబితాను జారీ చేసింది. ప్రచారం కోసం అధికారిక వాహనాల ఉపయోగాన్ని తొలగింపు, రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లు నుంచి రాజకీయ కార్యనిర్వాహకుల చిత్రాలు తొలగింపు, అధికారి పార్టీ ప్రకటనలకు ప్రజాధనం వాడకంపై నిషేధం తదితర నిబంధనలను పంపించింది. అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనల ప్రీ-యోగ్యతకు సంబంధించి, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నియమించుకోవాలని రాజకీయ పార్టీలకు గుర్తు చేసింది.
కాగా ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ మే 27తో, మిగిలిన నాలుగురాష్ట్రాల అసెంబ్లీ గుడువు మార్చితో ముగియనున్న సంగతి తెలిసిందే.