వాషింగ్టన్: ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుందనేది మనం ఇంతవరకూ విన్నాం. అయితే ఒకే ఒక్క స్ప్రే మీకు.. మీ పెంపుడు శునకానికి మధ్య బంధాన్ని మరింత పెంపొందిస్తోంది. హచ్ డాగ్ మాదిరిగా మనల్ని వాచ్ చేస్తుందట. ఈ అంశానికి సంబంధించి టోక్యో యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. సాధారణంగా పిట్యూటరీ గ్రంధి నుంచి విడుదలయ్యే ఆక్సిటోసిన్ లేదా లవ్ హార్మోన్ ల లక్షణాలు కల్గిన స్ప్రే ను రూపొందించి వివిధ జాతులకు చెందిన 16 పెంపుడు కుక్కులపై పరిశోధనలు జరిపారు.
తోటి శునకాలతో పాటు యజమానితో శునకాలు ఎలా వ్యవహరిస్తున్నాయనే అంశాన్ని పరిశీలించారు. వాసన చూడటం, నాకడం, మృదువుగా స్పశించడం, యజమాని శరీరంతో ఆడటం, సేదతీరడం వంటి వాటిని పరిగణనలోకి తీసుకున్నారు. అయితే ఆక్సిటోసిన్ స్ప్రే విడుదలైన తర్వాత శునకాల ప్రవర్తనలో చాలా మార్పు కనిపించిందట. యజమానిపై అమితమైన ప్రేమ కురిపించడం, ఉత్తేజంగా ఉండటం గుర్తించారు. శునకాల గుండె వేగంలో మార్పులనూ గమనించారు. అయితే ఈ స్ప్రే కు శత్రువులను మిత్రులుగా మార్చే గుణం లేదని, ముందు ఉన్న స్నేహ బంధాన్ని మాత్రమే పెంపొందిస్తుందని పరిశోధకులు తెలిపారు.