ఎంపీలో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు హోరాహోరీ పోరు నెలకొంది. రాష్ట్రంలోని 230 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 25న ఎన్నికలు జరుగనుండగా, ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోగలమని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు, ‘అభివృద్ధి’ మంత్రంతో హ్యాట్రిక్ సాధించగలమని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఆశలు పెట్టుకుంటున్నారు. బీజేపీ తరఫున ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తమ తమ పార్టీల తరఫున ఎంపీలో విస్తృతంగా ప్రచారం చేశారు.
మంత్రులపై అవినీతి ఆరోపణలు, రాష్ట్రంలో అభివృద్ధి లేమిని కాంగ్రెస్ తన ప్రచారాస్త్రాలుగా వాడుకుంది. పరిస్థితుల్లో మార్పు రావాలంటే బీజేపీ సర్కారును గద్దెదించాలని ఓటర్లకు పిలుపునిచ్చింది. అయితే, బీజేపీ తన ప్రచారంలో గడచిన పదేళ్లలో చౌహాన్ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ఏకరువు పెడుతూ, మరోసారి అవకాశం ఇవ్వాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించింది. పరస్పర ఆరోపణలతో సాగిన ప్రచారపర్వం శనివారం ముగిసింది. కాంగ్రెస్ అధికారికంగా తన ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ప్రకటించకున్నా, తమ పార్టీ గెలిస్తే కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగడం కూడా కలసి వచ్చే అంశంగా భావిస్తోంది.