వీడియో ఆధారాలు సమర్పించండి!
చెన్నై: బలపరీక్ష సందర్భంగా జరిగిన పరిణామాలపై తమిళనాడులో రాజకీయ వేడి కొనసాగుతోంది. అసెంబ్లీలో గత శనివారం నిర్వహించిన బలపరీక్ష చెల్లదంటూ ప్రధాన ప్రతిపక్షం డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు తన విచారణను సోమవారానికి వాయిదా వేసింది. బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించిన వీడియో దృశ్యాలను ఆధారాలుగా సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా డీఎంకే సభ్యుల విధ్వంస, నిరసన, ఆ పార్టీ అధినేత స్టాలిన్ సహా ఎమ్మెల్యేలను బలవంతంగా సభ నుంచి గెంటేయడం వంటి తీవ్ర ఉద్రిక్త పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పళనిస్వామి విజయం సాధించిన బలపరీక్ష చెల్లదంటూ డీఎంకే కోర్టుకు ఎక్కింది. అంతేకాకుండా ఈ బలపరీక్షను వ్యతిరేకిస్తూ.. తమిళనాడు అంతటా డీఎంకే ఆందోళనలకు పిలుపునిచ్చింది. స్టాలిన్ నేతృత్వంలో ఆ పార్టీ బుధవారం ఒకరోజుపాటు నిరాహార దీక్షలకు కూర్చుంది.
మరోసారిఅసెంబ్లీ వేదికగా బలపరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ డీఎంకే అధినేత స్టాలిన్ సైతం నిరాహార దీక్షలో కూర్చున్నారు. మరోవైపు చట్టప్రకారమే అసెంబ్లీ బలపరీక్ష జరిగిందని, డీఎంకే కావాలనే పళనిస్వామిపై దుష్ప్రచారం చేస్తున్నదని అన్నాడీఎంకే మండిపడుతోంది.