
రెండేళ్లలో దేశీయ చిన్న విమానం రెడీ
దేశీయంగా తమ తొలి 8 సీట్ల చిన్న విమానాన్ని మహీంద్రా ఏరోస్పేస్ మరో రెండేళ్లలో తయారు చేయనుంది.
బెంగళూరు: దేశీయంగా తమ తొలి 8 సీట్ల చిన్న విమానాన్ని మహీంద్రా ఏరోస్పేస్ మరో రెండేళ్లలో తయారు చేయనుంది. నూతన ప్లాంటు ప్రారంభం సందర్భంగా మహీంద్రా సిస్టెక్ ప్రెసిడెంట్ హేమంత్ లూథ్రా ఈ విషయం తెలిపారు. ప్రస్తుతం తమ ఆస్ట్రేలియా కంపెనీలైన ఏరోస్టాఫ్, గ్రిప్స్‌ఏరోల్లో ఈ తరహా జీఏ8 యుటిలిటీ విమానాలను తయారు చేస్తున్నట్లు లూథ్రా వివరించారు. ఆస్ట్రేలియా నుంచి ఇప్పటిదాకా 250 దాకా విమానాలను ఎగుమతి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే 18 మంది ప్రయాణికులకు సరిపడే జీఏ18 విమాన తయారీపై కసరత్తు చేస్తున్నట్లు లూథ్రా తెలిపారు.
ప్రతిపాదిత ఎయిట్‌సీటర్ జీఏ8 విమానం సుమారు 1,100 కి.మీ. దూరం ప్రయాణించగలుగుతుంది. చిన్న పట్టణాలు, నగరాలను అనుసంధానించేందుకు ఈ విమానాలు అనువుగా ఉండనున్నాయి. ఇలాంటి ప్రాంతాలకు చేరుకునేందుకు ప్రధానంగా రోడ్డు లేదా రైల్వే మార్గాల మీదే ఆధారపడే దేశీ టూరిస్టులకు ఇవి ఉపయోగకరంగా ఉండగలవని లూథ్రా పేర్కొన్నారు. మహీంద్రా సిస్టెక్‌లో మహీంద్రా ఏరోస్పేస్ భాగం. మహీంద్రా ఏరోస్పేస్ ప్లాంటును రూ. 150 కోట్లతో ఏర్పాటు చేయగా, 400 మందికి ఉపాధి లభించనుంది. కంపెనీకి ఇది సుమారు రూ. 250 కోట్ల మేర ఆదాయాన్ని ఆర్జించి పెట్టగలదని అంచనా.
Mahindra Systech
మరోవైపు, ఈ ప్లాంటు దేశీయ ప్రైవేట్ రంగంలోనే తొలి ఏరోస్ట్రక్చర్ కేంద్రమని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. తాము తయారు చేసే విమానాలు కఠినమైన ప్రాంతాల్లోనూ లాండింగ్ అయ్యే సామర్థ్యం కలిగి ఉంటాయన్నారు. చిన్న విమానాలకు దేశీయంగా మంచి డిమాండ్ ఉండగలదని, ఈ నేపథ్యంలో విమానాల తయారీకి అపార అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. విమాన రంగంలో వినియోగదారు హోదా నుంచి ప్రపంచ స్థాయి ఉత్పత్తిదారుగా భారత్ ఎదిగే క్రమంలో తమ వంతు పాత్ర పోషించాలని నిర్దేశించుకున్నట్లు ఆనంద్ మహీంద్రా చెప్పారు. ప్రస్తుతం భారత్ పెద్ద ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎయిర్‌బస్, బోయింగ్‌ల నుంచి.. 70-80 సీటర్లను ఎంబ్రేయర్, బొంబార్డియర్ వంటి సంస్థల నుంచి దిగుమతి చేసుకుంటోంది. చిన్న చిన్న ఎయిర్‌క్రాఫ్ట్‌లు వివిధ విదేశీ సంస్థల నుంచి దిగుమతి అవుతున్నాయి.