'హైదరాబాద్ ను యూటీ చేయండి'
రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వ కసరత్తు ఊపందుకున్న నేపథ్యంలో భారత ప్రధాని మన్మోహన్ సింగ్ తో కేంద్రమంత్రులు సోమవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. ప్రధానితో జరిగిన భేటిలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత (యూటీ) ప్రాంతంగా చేయాలని ప్రధానికి విజ్ఞప్తికి చేశారు. ఈ భేటీలో విభజనపై సీమాంధ్ర కేంద్ర మంత్రులు.. దాదాపు అంగీకారానికి వచ్చినట్టు స్పష్టమవుతోంది.
ప్రధానితో భేటీ అయిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు.. విభజనకు ఓకే అన్నట్టు సమాచారం. హైదరాబాద్‌ను యూటీ చేయాలన్న ప్రధాన డిమాండ్‌ను మన్మోహన్ ముందుంచినట్టు తెలిసింది. 11 అంశాలపై ప్రధానికి నివేదిక ఇచ్చిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు సీమాంధ్రకు విభజన వల్ల కలిగే నష్టాలను పూరించేలా చర్యలు చేపట్టాలని కోరినట్టు తెలిసింది.
భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన పురందేశ్వరీ.. జీవోఎం విధివిధానాలపై ప్రధానితో చర్చించినట్లు చెప్పారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తామని ప్రధానితో తమతో అన్నారని తెలిపారు. కేంద్ర మంత్రుల రాజీనామాలపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ప్రధాని తమతో అన్నట్లు పురందేశ్వరీ చెప్పారు.