సవతి సోదరుడిని చంపించింది కిమ్మే!
హత్య వెనుక ఉత్తర కొరియా హస్తముంది
ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సవతి సోదరుడు కిమ్ జాంగ్ నామ్ హత్య కేసు దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగుచూశాయి. నామ్ హత్య వెనుక ఉత్తర కొరియా హస్తమున్నట్టు తాజాగా మలేషియా జరిపిన దర్యాప్తులో వెలుగుచూసిందని దక్షిణకొరియా తెలిపింది. కౌలాలంపూర్ ప్రధాన విమానాశ్రయంలో గత సోమవారం కిమ్ జాంగ్ నామ్ విషప్రయోగం ద్వారా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఒక ఉత్తర కొరియా వ్యక్తిని అరెస్టు చేశామని, మరో నలుగురు ఆ దేశ పౌరుల కోసం గాలిస్తున్నామని మలేషియా పోలీసులు తెలిపారు. నామ్ హత్య జరిగినరోజే ఆ నలుగురు దేశాన్ని విడిచిపోయారని పోలీసులను ఉటంకిస్తూ దక్షిణ కొరియా పేర్కొంది.
నామ్ హత్య వెనుక ఉత్తర కొరియా హస్తం ఉన్నట్లు అనుమానాలు వస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో నియంతృత్వ పోకడలను నిరసించిన నామ్ అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. లాయర్ అయిన నామ్‌ను అతని తండ్రి కిమ్ జోంగ్-2 హయాంలో రాజకీయ వారసుడిగా పరిగణించేవారు. ఆయన మరణానంతరం సవతి సోదరుడు కిమ్ జోంగ్ ఉన్ పాలన పగ్గాలు చేపట్టారు. దీంతో ఎప్పటికైనా తనకు అడ్డు అన్న కారణంతోనే నామ్‌ను మహిళతో కిమ్ హత్య చేయించి ఉంటాడని అనుమానాలు వస్తుండగా.. ఈ హత్య వెనుక ఉత్తరకొరియా హస్తముందని తాజా దర్యాప్తులో తేలడం గమనార్హం.