చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి చెలరేగిపోయారు.
► సీఆర్‌పీఎఫ్ జవాన్లపై మెరుపుదాడి
► విచక్షణారహితంగా కాల్పులు, గ్రెనేడ్లు విసిరిన వైనం
► 25 మంది హతం, ఆరుగురికి గాయాలు
► భోజనానికి సన్నద్ధమవుతుండగా ఘటన
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మారణహోమం సృష్టించారు. సుక్మా జిల్లాలో మంగళవారం వందలాది మంది మావోలు జరిపిన దాడిలో 25 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు చనిపోగా మరో ఆరుమంది గాయపడ్డారు. దక్షిణ బస్తర్‌లోని చింతగూడకు సమీపంలోగల కల్పధర్ అటవీ ప్రాంతంలో మధ్యాహ్నం గం 12.25 సమయంలో ఈ ఘటన జరిగింది.
అటవీ ప్రాంతంలో రోడ్డు పనులు జరుగుతున్న చోట ఉన్న జవాన్లపై దాదాపు 300 మంది మావోయిస్టులు అకస్మాత్తుగా దాడి చేసి రెండువైపులా కాల్పులు జరిపారు. మావోయిస్టులకు, సీఆర్‌పీఎఫ్ జవాన్లకు మధ్య భీకరంగా కాల్పులు జరిగాయి. మావోయిస్టులు పెద్ద ఎత్తున ఆయుధాలను ఎత్తుకెళ్లినట్టు సమాచారం. ఈ ఘటన అనంతరం జవాన్లు కూంబింగ్ ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
సీఆర్‌పీఎఫ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎం.దినకరన్ మాట్లాడుతూ మొదట తమకు 11 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని, మరొకరు ఆస్పత్రిలో మరణించారని చెప్పారు . అనంతరం పరిసర ప్రాంతాల్లో గాలింపుల్లో మరో 12 మంది మృతదేహాలు కూడా లభ్యమయ్యాయని ఆయన తెలిపారు. ఈ విషయమై దాడిలో ప్రాణాలతో బయటపడిన ఓ జవాను మాట్లాడుతూ తాము భోజనం చేసేందుకు సన్నద్ధమవుతుండగా పొదల్లో మాటువేసిన 300 మంది మావోయిస్టులు దాడి చేశారని చెప్పాడు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారని, అంతేకాకుండా గ్రెనేడ్‌ను కూడా విసిరారని తెలిపాడు.
చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ వెంటనే మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. మావోలు కాల్పులు జరపడంతో తాము ప్రతిదాడి చేశామని, ఇరువర్గాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందన్నారు. కాగా క్షతగాత్రులను హెలికాప్టర్‌ద్వారా ఆస్పత్రులకు తరలించినట్లు తెలిపారు. ఇదే జిల్లాలో ఈ ఏడాది మార్చి, 12న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు చనిపోవడం తెలిసిందే. 2010లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏకంగా 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
పిరికి చర్య: ప్రధాని
మావోయిస్టుల దాడిని ప్రధాని నరేంద్రమోదీ పిరికిపంద చర్యగా అభివర్ణించారు. అమరవీరుల త్యాగాలు వృథాపోవన్నారు. ఈ దాడి గర్హనీయమన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారని ప్రధానమంత్రి ప్రకటించారు.
బాధ కలిగింది: రాజ్‌నాథ్
మావోయిస్టుల దాడి తనను బాధించిందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. ఘటనాస్థలిని సందర్శించాల్సిందిగా సహాయమంత్రి హన్స్‌రాజ్ ఆహిర్‌కు సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. వారిని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.
ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్న సీఎం
ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని రాజధాని నగరం రాయ్‌పూర్ చేరుకున్నారు. ఉన్నతాధికారులతో సమావేశమై ఈ విషయమై చర్చించారు. బాధితులను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. సీఎం ఢిల్లీ నుంచి మంగళవారం రాష్ట్రానికి రావాల్సి ఉండగా, దాడి నేపథ్యంలో సోమవారమే వచ్చారు.