హీరో సాయంపై మావోయిస్టుల కౌంటర్
రాయ్‌పూర్: తమ దాడిలో మృతి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఆర్థిక సహాయం చేయడాన్ని మావోయిస్టులు ఖండించారు. పేదలకు అండగా నిలవాలని సెలబ్రిటీలకు సూచించారు.
‘మావోయిస్టుల దాడిలో హతమైన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడాన్ని ఖండిస్తున్నాం. ప్రముఖులు, సినిమా నటులు, క్రీడాకారులు, సెలబ్రిటీలు.. పోరాటం, పేదల పక్షాన నిలవాలి. పోలీసుల వేధింపులు, మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా గళమెత్తాల’ని మావోయిస్టులు ఓ కరపత్రం విడుదల చేశారు. దళితులు, ముస్లింలపై గోరక్షకులు దాడులు చేస్తున్నారని ఇందులో పేర్కొన్నారు.
ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో మార్చిలో మావోయిస్టులుజరిపిన మెరుపు దాడిలో 27 మంది సీఆర్పీఎఫ్ జవానులు ప్రాణాలు కోల్పోయారు. వీరికి కుటుంబాలకు రూ. 9 లక్షల చొప్పున అక్షయ్ కుమార్ ఆర్థిక సహాయం ప్రకటించారు. రూ. 50 వేలు చొప్పున సాయం చేస్తానని సైనా నెహ్వాల్ తన 27వ పుట్టినరోజు నాడు వాగ్దానం చేసింది.