నిరోధశ్రేణి 20,867-20,907
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తాజా పెట్టుబడుల బదులు లాభాల స్వీకరణకే ఇన్వెస్టర్లు మొగ్గుచూపడంతో ముగిసినవారంలో స్టాక్ సూచీలు గరిష్టస్థాయి నుంచి 3 శాతం మేర పతనమయ్యాయి. దేశీ స్టాక్ మార్కెట్‌ను డ్రైవ్ చేస్తున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు డిసెంబర్ 9వరకూ పెట్టుబడుల జోరు కనపర్చినా అటుతర్వాత వెనుకడుగువేయడంతో గరిష్టస్థాయిలో సూచీలు స్థిరపడలేకపోయాయి. సూచీలు ఆల్‌టైమ్ గరిష్టస్థాయికి చేరిన తర్వాత సాంకేతికంగా జరిగే సర్దుబాటులో భాగంగానే గతవారం క్షీణత జరిగిందని ప్రస్తుతానికి పరిగణించాల్సివుంటుంది. ఇది సహజ సర్దుబాటు ప్రక్రియే అయితే ఈ వారం రిజర్వుబ్యాంక్, ఫెడ్ పాలసీ ప్రకటనల తర్వాత స్టాక్ సూచీలు నాటకీయంగా పెరిగే ఛాన్స్ వుంటుంది. రాబోయే డౌన్‌ట్రెండ్‌కు ఇటీవలి గరిష్టస్థాయివద్ద బీజం పడివుంటే రానున్నవారాల్లో పెద్ద పతనం సంభవించే ప్రమాదం కూడా వుంటుంది. ఈ వారం పాలసీ ప్రకటనల తర్వాత దిగువన ప్రస్తావించిన మద్దతు, నిరోధస్థాయిల వద్ద సూచీలు ప్రవర్తించేతీరును బట్టి మధ్యకాలిక ట్రెండ్‌పై స్పష్టమైన అంచనాలకు రావొచ్చు.
సెన్సెక్స్‌పై సాంకేతిక అంచనాలు
డిసెంబర్ 13తో ముగిసినవారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ గతవారపు అంచనాలకు అనుగుణంగా 21,484 గరిష్టస్థాయికి చేరిన తర్వాత వేగంగా 700 పాయింట్ల మేర నష్టపోయి, 20,692 స్థాయికి పతనమయ్యింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 281 పాయింట్ల నష్టంతో 20,716 వద్ద ముగిసింది. ఈ వారం సెన్సెక్స్‌కు 20,867-20,907 శ్రేణి (ఇది డిసెంబర్ 13నాటి గ్యాప్‌డౌన్‌స్థాయి) వద్ద తక్షణ నిరోధం ఎదురుకావొచ్చు. ఆపైన స్థిరపడితే 21,050 స్థాయికి చేరవచ్చు. ఈ స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో ఛేదిస్తే కొద్దివారాల్లో మళ్లీ 21,500-21,600 శ్రేణిని అందుకోవొచ్చు. ఈ వారం మార్కెట్ క్షీణతతో మొదలైతే 20,670 సమీపంలో తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ లోపున వేగంగా 20,460 వద్దకు తగ్గవచ్చు. ఈ స్థాయిని ముగింపులో కోల్పోతే 20,325 స్థాయికి పతనం కావొచ్చు. ఈ స్థాయి దిగువన మరోదఫా 20,137 స్థాయిని పరీక్షించవచ్చు.
నిఫ్టీ తక్షణ నిరోధం 6,232
డిసెంబర్13తో ముగిసినవారంలో గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన అంచనాలకు అనుగుణంగానే 6,415 గరిష్టస్థాయికి చేరి, అటుతర్వాత వేగంగా 6,160 స్థాయికి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ క్షీణించింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 92 పారుుంట్ల నష్టంతో 6,168 వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీకి 6,232 వద్ద తక్షణ అవరోధం ఎదురవుతున్నది. డిసెంబర్ 5న గ్యాప్‌అప్ సందర్భంగా 6,209-6,232 మధ్య గ్యాప్ ఏర్పడగా, డిసెంబర్ 13న గ్యాప్‌డౌన్‌తో మార్కెట్ మొదలుకావడంతో సరిగ్గా అదేస్థాయిలో.....అంటే 6,208-6,230 మధ్య ట్రేడింగ్ గ్యాప్ ఏర్పడింది. రానున్నరోజుల్లో మార్కెట్లో తిరిగి అప్‌ట్రెండ్ మొదలుకావాలంటే ఈ గ్యాప్ అవరోధాన్ని నిఫ్టీ అధిగమించాల్సివుంటుంది. ఈ నిరోధంపైన ముగిస్తే వేగంగా 6,275 స్థాయికి చేరవచ్చు. ఆపైన స్థిరపడితే కొద్ది వారాల్లో తిరిగి 6,415 స్థాయికి చేరవచ్చు. ఈ సోమవారం మార్కెట్ బలహీనంగా మొదలైతే 6,150 సమీపంలో తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే వేగంగా 6,112 వద్దకు తగ్గవచ్చు. ఈ స్థాయి దిగువన ముగిస్తే క్రమేపీ 6,030 స్థాయికి తగ్గవచ్చు. ఈ దిగువన 5,972 స్థాయికి పతనం కావొచ్చు.
బ్యాంక్ నిఫ్టీ కీలకం....
ఆర్‌బీఐ, ఫెడ్ నిర్ణయాలు వెలువడిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ కదలికలు మొత్తం మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయవచ్చు. బ్యాంకింగ్ షేర్లకు సెన్సెక్స్, నిఫ్టీల్లో 30-40% వెయిటేజీ వుండటం, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు ఈ షేర్లలో అధికశాతం పెట్టుబడులు వుండటం, భారత్, అమెరికా కేంద్ర బ్యాంకులు చేసే పాలసీ ప్రకటనలు వడ్డీ రేట్లను నిర్దేశించేవికావడం వంటి అంశాల కారణంగా బ్యాంక్ నిఫ్టీ కదలికలకు ఈ వారం ప్రాధాన్యత వుంది. ముగిసినవారంలో ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీల క్షీణత 1.5 శాతంలోపునకే పరిమితమైనా, బ్యాంక్ నిఫ్టీ మాత్రం 3 శాతం క్షీణించి 11,367 వద్ద ముగిసింది. గరిష్టస్థాయి నుంచి ఈ సూచీ 8 శాతం పడిపోయింది. బ్యాంక్ నిఫ్టీ తిరిగి అప్‌ట్రెండ్‌లో ప్రవేశించాలంటే ఈ బుధ, గురువారాల్లో బ్యాంక్ నిఫ్టీ వేగంగా 11,750 వద్దనున్న తొలి అవరోధాన్ని అధిగమించాల్సివుంటుంది. ఆపైన డిసెంబర్ 9నాటి 12,225 గరిష్టస్థాయిని వేగంగా అందుకోవొచ్చు. అటుపైన స్థిరపడితే 13,000 స్థాయికి కొద్దివారాల్లో పెరగవచ్చు. ఈ వారం 11,750 నిరోధాన్ని దాటలేకపోతే 10,650-10,800 మద్దతుశ్రేణికి తగ్గవచ్చు. ఈ లోపున 10,300 స్థాయికి నిలువునా పతనమయ్యే ప్రమాదం ఉంటుంది.
మార్కెట్ పంచాంగం
Published Mon, Dec 16 2013 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM
Advertisement
Advertisement