ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వ రుసగా నాలుగో రూజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో లాభాలతో ఉత్సాహంగా మొదలైన మార్కెట్లు చివర్లో ప్రాఫిట్ బుకింగ్‌కారణంగా నష్టాలతో ముగిశాయి. అటు సాధారణ వర్షపాతం నమోదుకానుందని వాతావరణ శాఖ నివేదించినప్పటికీ దలాల్‌స్ట్రీట్ నష్టాల బాట పట్టింది. సెన్సెక్స్ 94 పాయింట్లు క్షీణించి 29,319 వద్ద, నిఫ్టీ సైతం 34 పాయింట్లు నష్టపోయి 9,105 వద్ద ముగిసింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 9,150 దిగువన స్థిరపడింది. అంతేకాకుండా 9,100 సమీపంలో నిలిచింది. అమ్మకాలు ఊపందుకోవడంతో ఒక దశలో దాదాపు 400 పాయింట్లు పతనమైంది. ముఖ్యంగా ఇటీవల మార్కెట్ ఫేవరెట్లుగా నిలుస్తున్న రియల్టీ షేర్లతోపాటు, మెటల్ కౌంటర్లలో భారీ అమ్మకాలకు తెరలేచింది. రియల్టీ 3.3 శాతం, మెటల్ 1.75 శాతం చొప్పున పతనంకాగా.. ఫార్మా, ఆటో 0.8 శాతం చొప్పున నష్టపోయాయి. టాటా స్టీల్, ఇన్‌ఫ్రాటెల్, అంబుజా, ఐషర్, కోల్ ఇండియా, టాటా మోటార్స్ డీవీఆర్, ఐబీ హౌసింగ్, సన్ ఫార్మా, ఆర్‌ఐఎల్, ఏషియన్ పెయింట్స్ నష్టాల్లోనూ, మరోపక్క అరబిందో, ఎన్‌టీపీసీ, ఐవోసీ, హిందాల్కో, బీవోబీ, స్టేట్‌బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభాల్లోనూ ముగిశాయి.
అటు డాలర్ మారకంలో రూపాయి 0.07 పైసలులాభపడి రూ. రూ64.59 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పది గ్రా. రూ.90 క్షీణించి రూ.29, 340 వద్ద ఉంది.