పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండాల్సింది
హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల భూముల సమస్యల పరిష్కారానికి ఆగస్టు 10 వ తేదీ నుంచి 'మీ భూమి మీ ఇంటికి' కార్యక్రమం నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. అందులోభాగంగా 20 రోజులపాటు రెవెన్యూ సభలు నిర్వహిస్తామని వెల్లడించారు. కర్నూలు జిల్లాలోపరిశ్రమల ఏర్పాటు కోసం 33 వేల ఎకరాల భూములు కేటాయించామని కేఈ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా తహసీల్దార్ వనజాక్షికి బెదిరింపు లేఖ వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే వనజాక్షి తనకు అందిన బెదిరింపు లేఖను విచారణాధికారికి అందజేయాలని సూచించారు.
తహశీల్దార్ వనజాక్షికి రక్షణ కల్పించమని ఇప్పటికే జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని వివరించారు. కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై అక్రమ ఇసుక తవ్వకాల విషయంలో పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేశారు. దాంతో ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఈ ఘటనపై ఐఏఎస్ అధికారి జేసీ శర్మతో ప్రభుత్వం ఓ కమిటీ వేసిన సంగతి తెలిసిందే.