బహుభాష నటుడు కమల్ హాసన్, కన్నడ నటులు దర్శన్, సుదీప్లకు నోటీసులు జారీ అయ్యాయి.
బెంగళూరు : బెంగళూరు నగరం నడిబొడ్డున ఉన్న త్రివేణి సినిమా థియేటర్ను ఎవ్వరు కొనుగోలు చేయటానికి వీలులేదని బహుభాష నటుడు కమల్ హాసన్, కన్నడ నటులు దర్శన్, సుదీప్లకు నోటీసులు జారీ అయ్యాయి. వివరాల్లోకి వెళితే మెజిస్టిక్ సమీపంలోని గాంధీనగరలో త్రివేణి చిత్ర మందిర పేరుతో సినిమా థియేటర్ ఉంది. దేవకుమార్ అనే వ్యక్తి 25ఏళ్ల క్రితం ఈ సినిమా థియేటర్ను నిర్మించారు. ప్రస్తుతం సుదీప్ సన్నిహితులు ఈ థియేటర్ ను లీజ్తో నడిపిస్తున్నారు.
2014 ఆగస్ట్ 1వరకు లీజ్ అనుమతి ఉంది. అయితే దేవకుమార్ కోడలు మంజుల ఉమేష్ థియేటర్ను విక్రయించడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో త్రివేణి థియేటర్ను కమల్ హాసన్ , సుదీప్, దర్శన్ కొనుగోలు చేస్తారనే ప్రచారం నెలకొంది. ఇంతలోనే దేవకుమార్ మనవరాలు దక్షగౌడ థియేటర్లో తనకు భాగస్వామ్యం ఉందని, తనకు తెలియకుండా ఎవ్వరూ కొనుగోలు చెయ్యరాదని తన న్యాయవాదితో కమల్ హాసన్, సుదీప్, దర్శన్లకు నోటీసులు పంపించారు. దీంతో చిత్ర పరిశ్రమలో ఈ వ్యవహారం తీవ్ర దుమారాన్ని లేపింది.