
సమన్వయంతో ముందుకెళ్దాం
టాటా గ్రూప్ కంపెనీలు తమలో తాము ఎలాంటి దాపరికాలకూ తావివ్వకుండా సమన్వయంతో ముందుకెళ్లాలని టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ కంపెనీలు తమలో తాము ఎలాంటి దాపరికాలకూ తావివ్వకుండా సమన్వయంతో ముందుకెళ్లాలని టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ పిలుపునిచ్చారు. వినూత్నతపై దృష్టిపెట్టడంతోపాటు అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొని విజయాన్ని సొంతం చేసుకునే తత్వాన్ని అలవర్చుకోవాలని ఉద్బోధించారు. గ్రూప్ సంస్థల వద్దనున్న వనరులను తగినవిధంగా ఉపయోగించుకోవడం చాలా ముఖ్యమన్నారు. చైర్మన్‌గా పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఉద్యోగులకు ఆయనొక లేఖ రాశారు. ‘‘టాటా వ్యాపార సామ్రాజ్యంలో ప్రతి సంస్థకూ తనదైన ప్రత్యేకత ఉంది. ఇది గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెట్జీ టాటా 175వ జయంతి. ఆయన వారసత్వాన్ని మున్ముందుకు తీసుకెళ్లడానికి ఉద్యోగులంతా తమవంతు కృష్టిచేయాలి’’ అని మిస్త్రీ తన లేఖలో పేర్కొన్నారు. ఇంకా ఏమన్నారంటే...
వ్యూహాలకు మరింత పదును పెట్టాలి...
2013 సంవత్సరమంతా అనిశ్చితి, ప్రతికూలతలు, సవాళ్లతో గడిచింది. మన వ్యూహాల్లో కొన్నింటిని పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వ్యాపార విధానాల్లో మార్పుచేర్పులు, నిర్వహణ సామర్థ్యానికి మరింత పదునుపెట్టడం, పెట్టుబడుల్లో భవిష్యత్ ధోరణికి పెద్దపీటవేయడం వంటివి అత్యంత కీలకం. భారత్, యూరప్ వంటి కీలక మార్కెట్లలోని ఆర్థిక మందగమనం ప్రభావం గ్రూప్‌లోని అనేక కంపెనీలపై పడింది. ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. ఈ అనిశ్చితిని తట్టుకొని విజయం సాధించాలన్నా, ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలన్నా సమష్టితత్వం, భవిష్యత్తును దృష్టిలోపెట్టుకొని వ్యూహాలను రూపొందించుకోవడం, కొత్తపోకడలను నేర్పుగా ఒడిసిపట్టుకోవడం వంటివి కావాలి. వినూత్నతతో పాటు పరిశోధన-అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ)లో పెట్టుబడుల్ని, నిపుణుల్ని పెంచుకోవాలి.
సామాజిక బాధ్యతా ముఖ్యమే...
గ్రూప్ సంస్థలు వందకు పైగా ఉన్నాయి. ఉద్యోగులు 5 లక్షలపైనే ఉన్నారు. ఇలాంటి టాటా గ్రూప్ వ్యాపారంలోనే కాక సామాజిక బాధ్యతలో కూడా ప్రపంచ శక్తిగా ఆవిర్భవించింది. సామాజికాభివృద్ధి విషయంలో గ్రూప్ ఉద్యోగులు తమవంతు పాత్ర పోషించాలి. నాకైతే వాటాదారులకు దీర్ఘకాలంలో మరింత సంపదను సృష్టించి పెట్టగలమనే దృఢమైన విశ్వాసం ఉంది. గ్రూప్ బ్రాండ్ విలువను పెంపొందించడం, నైతిక విలువలతో కూడిన వ్యాపార విధానాలకు కట్టుబడటంలో... వ్యవస్థాపకుడు జంషెట్జీ నుంచి జేఆర్‌డీ టాటా, తాజాగా రిటైరయిన రతన్ టాటాల అంకితభావాన్ని ఉద్యోగులు గుర్తుంచుకోవాలి. దీన్ని పరిరక్షించే బాధ్యత మనందరిపైనా ఉంది.
ఇదీ టాటా సామ్రాజ్యం...
2012-13 ఆర్థిక సంవత్సరంలో టాటా గ్రూప్ కంపెనీల మొత్తం ఆదాయం 96.79 బిలియన్ డాలర్లు(దాదాపు రూ. 5,27,047 కోట్లు). దీన్లో 63 శాతం మేర విదేశీ కార్యకలాపాల నుంచే లభిస్తోంది. 100కు పైగా దేశాల్లో కార్యకలాపాలున్న టాటా గ్రూప్... 150 దేశాలకు తమ ఉత్పత్తులు, సేవలను ఎగుమతి చేస్తోంది.