రెండు చేతులకు రెండు ఫ్రీఫ్రీఫ్రీ
నేనొక్కదాన్నే.. ఇంత పని చేయాలంటే ఎలా.. నాకేమీ నాలుగు చేతుల్లేవు అని విసుక్కునే వాళ్లెందరో.. ఇక విసుక్కోవద్దు. మీకు మరో రెండు చేతులు తగిలించడానికి మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) రోబోటిక్ నిపుణులు సిద్ధమవుతున్నారు. చిత్రంలోని రోబోటిక్ ఆర్మ్ డిజైన్ అదే. దీన్ని మనం భుజానికి బ్యాక్‌ప్యాక్‌లా ఈజీగా తగిలించుకోవచ్చు. 9 కిలోల బరువుండే ఈ ఎక్స్‌ట్రా చేతులు భారీ బరువులను ఎత్తేస్తాయి. అంతేకాదు.. మీ చేతికి అందని వస్తువులను తీసిపెడతాయి. అంటే.. ఆ సమయంలో మన ం మన చేతులతో మరొక పనిని చేసుకోవచ్చు. చూడ్డానికి ఇది స్పైడర్ మ్యాన్ సినిమాలోని విలన్ డాక్టర్ ఆక్టోపస్ తరహాలో కనిపిస్తున్నా.. ఇది సినిమాలోలాగా మెదడు ఆదేశాలకు అనుగుణంగా పనిచేయదు. మన శరీర కదలికలకు అనుగుణంగా ఈ రోబో చేతులు క దులుతాయి. అంటే.. మనం ఓ పుస్తకాన్ని చేతితో పట్టుకుంటే.. మన చేతులు ఏ దిశలో కదిలాయో.. ఇవి కూడా అలాగే కదులుతాయన్నమాట.
అయితే.. భవిష్యత్తులో మన అవసరాలను ముందే గ్రహించి.. దానికి తగ్గట్లు వ్యవహరించేలా ఈ రోబోటిక్ ఆర్మ్స్‌ను తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుతానికి వారు ప్రాథమిక నమూనాను రూపొందించారు. అవి తలుపులు తీయడం, చిన్నచిన్న సామాన్లను ఎత్తడం వంటి పనులు చేస్తున్నాయి.