‘టోల్’ తీసిన ఎంఎన్‌ఎస్
టోల్ కట్టొద్దంటూ రాజ్ ఠాక్రే పిలుపు
అడ్డొస్తే ఉతికి ఆరేయాలంటూ రెచ్చగొట్టిన అధినేత
ఆ వెంటనే టోల్ ప్లాజాలపై కార్యకర్తల దండయాత్ర..
సాక్షి, ముంబై: ‘‘రాష్ట్రంలో ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లో టోల్ చెల్లించవద్దు.. ట్రాఫిక్ జామ్ అయినా ఫర్వాలేదు.. ఎవరైనా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే వారిని ఉతికి ఆరేయండి’’ అంటూ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్‌ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి నవీ ముంబైలోని ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో రెచ్చిపోయిన కార్యకర్తలు తమ ప్రతాపాన్ని చూపించారు. ముంబై సహా థానే, కల్యాణ్, సాంగ్లీ, నాగపూర్ ప్రాంతాల్లోని టోల్ ప్లాజాలపై దాడులు చేశారు. సోమవారం తెల్లవారుజామువరకు దాడులు కొనసాగాయి.
పోలీసు బలగాలను రంగంలోకి దింపడంతో సోమవారం ఉదయానికి పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ముంబై పక్కనే ఉన్న ఒక్క థానే జిల్లాలోనే అరడజను టోల్ బూత్‌లను, బారికేడ్లను ఎంఎన్‌ఎస్ శ్రేణులు ధ్వంసం చేశాయి. మరాఠ్వాడలోని పలు టోల్ ప్లాజాలపై దాడులు చేసి మూసివేయించాయి. దాడులకు పాల్పడిన కార్యకర్తలను, ఎంఎన్‌ఎస్ ఎమ్మెల్యేలైన ప్రవీణ్, షాలిని ఠాక్రే, విజయ్ ఘాడి, టోంబరే తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. శివసేన, బీజేపీ నాయకులు కూడా టోల్‌కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు.
కొల్హాపూర్ ఘటనతో మొదలు..
కొద్ది రోజుల కిందట ఎంఎన్‌ఎస్.. టోల్‌కు వ్యతిరేకంగా కొల్హాపూర్‌లో చేపట్టిన ఆందోళనకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఆ తరువాత శివసేన కూడా టోల్ వసూళ్లను వ్యతిరేకిస్తున్నామని ప్రైవేటు కంపెనీలను హెచ్చరించింది. మరోపక్క ఎన్నికలు సమీపించడంతో ఎక్కడ ఓటర్లు శివసేనవైపు ఆకర్షితులవుతారోనని ఎంఎన్‌ఎస్‌కు దిగులు పట్టుకుంది. ఈ నేపథ్యంలోనే రాజ్ ఠాక్రే కార్యకర్తలను ఉసిగొల్పారని భావిస్తున్నారు.
‘‘అసలు టోల్ ఎందుకు వసూలు చేస్తున్నారు? ఆ డబ్బును దేనికి వాడుతున్నారో వెల్లడించేంతవరకు డబ్బులు చెల్లించవద్దు. భాగస్వాములైన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు టోల్ రూపంలో ఏటా కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయి. కానీ రోడ్ల దుస్థితి మాత్రం అలాగే ఉంది. కొద్ది పాటి వర్షం కురిసినా రహదారులన్నీ పూర్తిగా గుంతలమయమవుతున్నాయి. ఇలాంటి సమయంలో టోల్ డబ్బులు వసూలుచేసి ప్రయోజనమేంటి?’’ - రాజ్ ఠాక్రే