![ఇక మొబైల్ ఫోన్లే.. బ్యాంకులు, పర్సులు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/51482142061_625x300.jpg.webp?itok=nNwg4WQ0)
ఇక మొబైల్ ఫోన్లే.. బ్యాంకులు, పర్సులు
కాన్పూర్ :ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విపక్షాలపై విరుచుకుపడ్డారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో డీమానిటైజేషన్ పై చర్చ జరగ్గకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అవినీతిని కాపాడడానికే ప్రతిపక్షాలు పెద్ద నోట్లపై చర్చనుంచి దూరంగా పారిపోయాయని ధ్వజమెత్తారు. అయితే దేశంలో అవినీతిని నిరోధించడమే ప్రభుత్వ లక్ష్యమని మోదీ మరోసారి నొక్కి వక్కాణించారు. పార్లమెంటు కార్యక్రమాలను అడ్డుకునే క్రమంలో చివరికి స్పీకర్ పై పేపర్లు విసిరడం అమానుషమని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు దేశాధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీని విజ్ఞప్తిని కూడా పట్టించుకోలేదని విమర్శించారు.
కాన్పూర్ నిర్వహించిన పరివర్తన్ ర్యాలీలో సోమవారం పాల్గొన్న మోదీ పేదల కోసం అనేక సంక్షేమ కర్యక్రమాలను చేపట్టిందని ప్రధాని పేర్కొన్నారు. దేశంలో ఆరుశిక్షణ నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, పారిశ్రామిక శిక్షణ అందించడం నైపుణ్యాభివృద్ధి సంస్థ లక్ష్యమని చెప్పారు. దేశంలో పేదరికాన్ని పారద్రోలే శక్తి యువతలోనే ఉందని అన్నారు. డీమానిటైజేషన్ కష్టాలు త్వరలోనే తగ్గనున్నాయిన భరోసా ఇచ్చారు. దేశంలో వెయ్యి రూపాయల నోటు చలామణీలో ఉన్నపుడు రూ. 500, రూ.100 రూపాయల నోటు గురించి ఎవ్వరూ పట్టించుకోలేదని, పెద్దనోట్లు రద్దు నిర్ణయం అనంతరం ఇప్పుడు 100 రూపాయల నోటుకు కూడా ఎంతో ప్రాధాన్యం ఏర్పడిందని మోదీ అన్నారు.
మోదీ ప్రసంగంలో కొన్ని అంశాలు
- విప్లవాత్మకమైన డిమానిటేజేషన్ చరిత్రలో రికార్డు కాకపోవచ్చుకానీ, అవినీతిని రూపుమాపడంలో పెద్ద నోట్లను రద్దు చేసిన ఘనత ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది.
- అవినీతికి వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటంలో పేదల అండదండలు ప్రభుత్వానికి ఉన్నాయి.
- క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులపై లక్కీ డ్రా ద్వారా బహుమతులను పేదలు అందుకోనున్నారు.
- ప్రతి పక్షాల బలం నాకు తెలుసు.. బ్యాంకు ఆఫీసర్లకు లంచాలిస్తూ వారు ఏదైనా చేయగలరు. కానీ మా పోరాటం కొనసాగుతుంది.
- నల్లధనం కుబేరులకు చెక్ పెట్టేందుకు టెక్నాలజీ వాడుతున్నాం. ఈ క్రమంలో చాలా అప్రమత్తంగా ఉన్నాం. దేశవ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నాం.
- ఇక మీ మొబైల్ ఫోన్లే మీ బ్యాంకులు , పర్సులుగా మారనున్నాయి.
- మా అజెండా అవినీతి ఆపడానికి, వారి (ప్రతిపక్షాల) ఎజెండా పార్లమెంట్ అడ్డుకోవడం. జవాబుదారీగా, అవినీతికి వ్యతిరేకంగా ఉండటం కాంగ్రెస్ వల్లకాదు. రాజకీయ పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలి. ముఖ్యంగా విరాళాలు తీసుకునే సమయంలో అవినీతి రహిత రాజకీయాలకు ఉదాహరణగా నిలవాలి.
- నల్లధనంపై ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను.
- ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారనంతవరకు గుండారాజకీయాలకు అడ్డుకట్టవేయలేమని మోదీ పేర్కొన్నారు.