
పథకాల్లో రాష్ట్రాలకు స్వేచ్ఛ
సీఎంలకు ప్రధాని మోదీ లేఖ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రాయోజిత పథకాలను రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా రూపొందించుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు మంగళవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. అభివృద్ధి ప్రణాళికల మేరకు పథకాల్లో మార్పుచేర్పులు చేసుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉందని అందులో పేర్కొన్నారు. ‘‘కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను ఏకంగా 10 శాతానికి పెంచాలని ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. దీంతో ఇంతకుముందు 32 శాతంగా ఉన్న వాటా 42 శాతానికి చేరుతుంది. దీనివల్ల సహజంగానే కేంద్రం వద్ద నిధులు తగ్గుతాయి.
అయినా జాతీయ ప్రాధాన్యం గల పేదరిక నిర్మూలన, ఉపాధి హామీ, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం తదితరాలకు కేంద్రం నుంచి సాయం కొనసాగుతుంది. మీ చేతిలో పుష్కలంగా వనరులు ఉన్నప్పుడు.. కొన్ని పథకాలు, కార్యక్రమాలను పాత పద్ధతిలోనే అమలు చేయాలని లేదు. మీ విచక్షణ, అవసరాలకు అనుగుణంగా వాటిని మార్చుకోవచ్చు’’ అని ప్రధాని పేర్కొన్నారు. తమ అవసరాలకు అనుగుణంగా పథకాలు రూపొందించుకుంటామని, ఇందుకు సాయం చేయాల్సిందిగా రాష్ట్రాలు కొన్నేళ్ల నుంచి కేంద్రాన్ని కోరుతున్నాయన్నారు.