
కేంద్ర ప్రభుత్వ తీరుతో లౌకికత్వానికి ముప్పు
దేశంలో లౌకికత్వానికి కేంద్ర ప్రభుత్వంతోనే ముప్పుందని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు.
- రాజీవ్ సద్భావనాయాత్ర రజతోత్సవంలో ఆజాద్, దిగ్విజయ్ ధ్వజం
- కేంద్రమంత్రులు మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం
- జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తుండదు : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: దేశంలో లౌకికత్వానికి కేంద్ర ప్రభుత్వంతోనే ముప్పుందని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. సోమవారం ఇక్కడ రాజీవ్‌గాంధీ సద్భావనా యాత్ర రజతోత్సవ అవార్డును స్వీకరించిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ దేశ ప్రజల మధ్య ఐకమత్యం, సమానత్వం, సామరస్యం అనేవాటికి తూట్లు పొడిచేవిధంగా సాక్షాత్తు కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలే మాట్లాడుతున్నారని ఆరోపించారు.
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీనేత కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ పాల్గొన్న ఈ రజతోత్సవంలో ఆజాద్ మాట్లాడుతూ లౌకికవాదాన్ని కాపాడాల్సిన బాధ్యతల్లో ఉన్న వారే కంచె చేను మేసిందన్న విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా కేంద్ర మంత్రులు మాట్లాడటాన్ని, లౌకికవాదానికి తూట్లు పొడిచేవిధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడాన్ని దేశవ్యాప్తంగా మేధావులు గర్హిస్తున్నారని అన్నారు.
సాహిత్య అవార్డు గ్రహీతలు తమ అవార్డులను వెనక్కి ఇచ్చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారని ఆజాద్ వ్యాఖ్యానించారు. దేశంలో మెజారిటీ హిందువులదే అయినా, హిందువుల్లో మెజారిటీ లౌకిక వాదులదేనని అన్నారు. హిందూ, ముస్లింల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి, దేశాన్ని రెండు ముక్కలు చేయాలనే కుట్రలు సాగుతున్నాయని దిగ్విజయ్‌సింగ్ ఆరోపించారు. ఇలాంటి విభజన రాజకీయాలే గాంధీజీని బలిగొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘ్‌పరివార్ నేతలు, బీజేపీ నేతలు ఒక్కొక్కరు ఒకోరకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో మందిరం, మసీదు పక్కపక్కనే నిర్మించుకుని సామరస్యంగా జీవిస్తున్నారని అన్నారు. ఇప్పుడు పరస్పరం ధ్వంసం చేసుకునే దుష్ట రాజకీయాలకు ఆర్‌ఎస్‌ఎస్ శక్తులు కుట్రలు చేస్తున్నాయని దిగ్విజయ్ ఆరోపించారు. దేశంకోసం త్యాగాలు చేసిన గాంధీ, నెహ్రూ కుటుంబాల ఖ్యాతిని తగ్గించాలనే కుట్రతోనే వారి పేరుతో ఉన్న తపాలా స్టాంపులను రద్దుచేస్తున్నారని ఆయన విమర్శించారు.
మతోన్మాద శక్తులను నిలువరించడానికి కాంగ్రెస్‌పార్టీ నిరంతరం శ్రమిస్తుందన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎంఐఎంతో పొత్తు ఉండదని ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ ఒంటరిగానే పోరాడుతుందన్నారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ విచారణలో ఉన్న వికారుద్దీన్‌కు బేడీలు వేసి ఎన్‌కౌంటర్ పేరిట కాల్చి చంపారని విమర్శించారు. ఈ ఎన్‌కౌంటర్‌పై సీబీఐ విచారణ కోరిన పార్టీ ఒక్క కాంగ్రెస్ మాత్రమే అని అన్నారు. బీజేపీకి, సంఘ్‌పరివార్‌కు వంద తలలున్నాయని జైపాల్‌రెడ్డి దుయ్యబట్టారు. ఎన్ని తలలున్నా మాట్లాడేది మాత్రం మతోన్మాదమేనని విమర్శించారు.
ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు ఎత్తేయడానికి ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దానం నాగేందర్ మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలన్నారు. ఇదిలా ఉండగా దివంగత నేత, కేంద్ర మాజీమంత్రి జి.వెంకటస్వామి స్మారకార్థం ఇటీవలనే ఏర్పాటుచేసిన పార్కును గులాంనబీ ఆజాద్ సందర్శించారు. అక్కడ వెంకటస్వామి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.