చైనాకు చిక్కులు
కాలుష్యంలో l58 శాతం నగరాలు
బీజింగ్: రాజధాని బీజింగ్‌తో సహా సగానికిపైగా చైనా నగరాలు కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయి. దాదాపు 330 నగరాల్లో కాలుష్య హెచ్చరికలు జారీ చేసి, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది చైనా సర్కార్. ప్రత్యేకించి దక్షిణ చైనాలో పరిస్థితి మరింతగా దిగజారడంతో శిలాజ ఇంధనాలైన బొగ్గు, డీజిల్‌లో నడిచే పరిశ్రమలను మూసివేయాలంటూ అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. ఇక వాహనాల రాకపోకలపై అప్రకటిత నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు.
బీజింగ్‌కు కూతవేటు దూరంలో ఉన్న షిజాఝువాంగ్ నగరవాసులు మితిమీరిన కాలుష్యంతో అల్లాడిపోతున్నారని, ఈ నగరంలో ఏయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 దాటిందని చైనా పర్యావరణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. 12.8 శాతం నగరాల్లో ఏయిర్ క్వాలిటీ ఇండెక్స్ 201 నుంచి 300 మధ్య ఉందని వెల్లడించింది. మరో 9.8 నగరాల్లో 151 నుంచి 200 మధ్య ఉందని, ఈ నగరాలన్నింటిలో కాలుష్య నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. చలికాలం కావడంతో కాలుష్య సమస్య మరింతగా పెరిగిందని, వాతావరణ పరిస్థితులు మారితే కొంతమేర మెరుగుపడే అవకాశముందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.