ఇళ్లు కూలుస్తున్నారని మతమార్పిడి
రాంపూర్: తమ ఇళ్లు కూల్చివేస్తారనే భయంతో వాటిని, తమ హక్కులను కాపాడుకునేందుకు 800 మంది వాల్మీకి కులానికి చెందిన వ్యక్తులు ఉత్తరప్రదేశ్ లో మత మార్పిడి చేసుకున్నారు. తమ నివాసాలు కూల్చివేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నందున వాటిని రక్షించుకునేందుకు వేరే దారిలేక తాము ముస్లిం మతంలోకి మారుతున్నామని, అందుకు అంబేద్కర్ జయంతి రోజును ఎంచుకున్నామని తెలిపారు. కొందరు వ్యక్తులు తెలిపిన సమాచారం ప్రకారం ఆ వాల్మీకీలు ఉంటున్న స్థలం ప్రభుత్వానిదని, వాటిని వెంటనే ఖాళీ చేయాలని ఆ ఇళ్లకు గత వారమే రెడ్ మార్క్ కూడా వేశారు.
అయితే, వాస్తవానికి ఈ స్థలంపై యూపీ మంత్రి అజాంఖాన్ కన్నుపడిందని, ఆయన అక్కడ షాపింగ్ మాల్స్, వర్తక సముదాయాలు నిర్మించేందుకు వాల్మీకీలను ఖాళీ చేయాల్సిందిగా ఇబ్బంది పెడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు పలు రకాలుగా ప్రయత్నించిన వారంతా పలు రకాలుగా నిరసనలు తెలిపి చివరికి ముస్లిం మతంలోకి మారారు. అయితే, దీనిపై అజాంఖాన్ సన్నిహితుడొకరు మాట్లాడుతూ ముస్లిం మతంలోకి మారేముందు వారంతా ఒకసారి ఆలోచించుకోవాలని, అలా చేసినంత మాత్రాన ప్రభుత్వ నిర్ణయాలు మారవని చెప్పారు. ప్రభుత్వం స్థలం ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు.