మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది యాసిన్ భత్కల్ అరెస్ట్
ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది యాసిన్ భత్కల్(30) ఎట్టకేలకు పట్టుబడ్డాడు. నేపాల్ సరిహద్దులో అతన్ని అరెస్ట్ చేసినట్ట్టు సమాచారం. ఢిల్లీ, కర్ణాటక పోలీసుల జాయింట్ ఆపరేషన్లో అతడు పట్టుబడ్డాడు. అతడిని ఎక్కడికి తరలించాలనే దానిపై ఇంటెలిజెన్స్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు నిర్ణయం తీసుకోనున్నాయి.
మనదేశంలో జరిగిన పలు బాంబు పేలుళ్లలో భత్కల్ ప్రధాన నిందితుడు.మన రాష్ట్రంలో హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంటపేలుళ్లలో భత్కల్ కీలక సూత్రధారి. గోకుల్ ఛాట్, లుంబినీపార్క్ బాంబు పేలుళ్ల వెనుక కూడా ఇతడి హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. భత్కల్ తలపై ప్రభుత్వం పది లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది. 2010లో పుణెలో జర్మన్ బేకరీ, బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో భత్కల్ ప్రధాన నిందితుడు.
కర్ణాటక చెందిన యాసిన్ భత్కల్ తన సోదరుడు రియాజ్, అబ్దుల్ సుబాన్ ఖురేషీతో కలిసి 2008లో ఇండియన్ ముజాహిద్దీన్ స్థాపించాడు. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే ఇ తోయిబా అండదండలతో పనిచేస్తున్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) భావిస్తోంది.