ఏ-1ఎక్కడ? | Dilsukhnagar blast case A-1 Accused Riyaz Bhatkal | Sakshi
Sakshi News home page

ఏ-1ఎక్కడ?

Published Tue, Dec 20 2016 8:01 PM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM

ఏ-1ఎక్కడ?

ఏ-1ఎక్కడ?

రియాజ్‌ భత్కల్‌ నేతృత్వంలోనే సాగిన ‘రెండు ఆపరేషన్స్‌’
ఇప్పటికీ చిక్కని ప్రధాన నిందితుడు
దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసులో శిక్షలు ఖరారు
2008 నుంచి పాకిస్థాన్‌లో తలదాచుకున్న ఉగ్రవాది


రియాజ్‌ భత్కల్‌... 2007 నాటి గోకుల్‌ చాట్, లుంబినీపార్క్‌ , 2013 నాటి దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్లకు సూత్రధారిగా, ఈ కేసుల్లో ప్రధాన నిందితుడిగా (ఏ–1) ఉన్న మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లో నమోదైన విధ్వంసాల కేసుల్లో ఇతని పేరు ప్రముఖంగా ఉంది. ఉగ్రవాదం ముసుగులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సైతం నిర్వహించాడు. దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసు విచారణ పూర్తయి దోషులకు శిక్ష సైతం పడింది. 2007 నాటి జంట పేలుళ్ల కేసు విచారణ దశలో ఉంది. ఇప్పటికీ ఏ–1 చిక్కలేదు. అసలు ఎవరీ రియాజ్, ఉగ్రవాదిగా ఎలా మారాడు? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం..         

                      
సాక్షి, సిటీబ్యూరో: రియాజ్‌ భత్కల్‌ అసలు పేరు రియాజ్‌ అహ్మద్‌ షహబంద్రి. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా భత్కల్‌ గ్రామంలో 1976 మే 19న పుట్టాడు. ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు, స్మగ్లింగ్‌ వ్యవహారాలు ఎక్కువ. ఆ ప్రభావంతోనే నేరబాట పట్టాడు. వీరి కుటుంబం కొన్నాళ్ల పాటు మహారాష్ట్రలోని ముంబైలో నివసించింది. ఇతనికి ఆదినుంచీ డబ్బుపైన ఆశ ఎక్కువే. ఆ యావలోనే నేరబాట పట్టి ముంబై గ్యాంగ్‌స్టర్‌ ఫజల్‌–ఉర్‌–రెహ్మాన్‌ ముఠాలో చేరాడు. బెదిరింపులు, కిడ్నాప్‌లు తదితర వ్యవహారాల ద్వారా డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. ఈ మేరకు ఇతనిపై కోల్‌కతా, ముంబయి, కర్ణాటకల్లో అనేక కేసులు నమోదైనా... ఒక్కసారీ అరెస్టు కాలేదు. ఈ గ్యాంగు నుంచి బయటకు వచ్చిన తరవాత కుర్లా ప్రాంతంలో ‘ఆర్‌ఎన్‌’ పేరుతో కొత్తముఠా కట్టి కొంతకాలం వ్యవహారాలు సాగించాడు. అక్కడ ఉండగా స్థానికంగా ఓ ప్రార్థన స్థలంతో పాటు ప్రత్యేక కార్యక్రమాలకు తరచు వెళ్లేవాడు. ఆ ప్రోద్బలంతో నిషిద్ధ స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమి)లో కొంతకాలం పని చేశాడు. అప్పడికే ఇతని అన్న ఇక్బాల్‌ భత్కల్‌ పాక్‌ ప్రేరేపిత లష్కరేతోయిబాతో సంబంధాలు పెట్టుకోవడంతో అతని ద్వారా ఉగ్రవాదం వైపు మళ్లారు. ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, రెండో కమాండ్‌ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నాడు. ఆసిఫ్‌ రజా కమెండో ఫోర్స్‌ పేరుతో ఉగ్రవాద సంస్థను ప్రారంభించిన కోల్‌కతా వాసి అమీర్‌ రజాఖాన్‌ నుంచి అందే ఆదేశాల ప్రకారం చేపట్టాల్సిన విధ్వంసాలకు పేలుడు పదార్థాలు, మనుషులు, డబ్బు ఏర్పాటు చేస్తుంటాడు.

ధనార్జన కోసం రియల్టర్‌ అవతారం...
జిహాద్‌ పేరుతో యువకులను ఉగ్రవాదం వైపు నడిపించి వారి భవితను భత్కల్‌ బుగ్గిపాలు చేశాడు. తాను మాత్రం ఉగ్రవాదం పేరు చెప్పి వసూలు చేసిన నిధులను భారీగా దారిమళ్లించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నిర్వహించాడు. మరిన్ని నిధుల కోసం పూణేకు చెందిన వ్యాపారులను కిడ్నాప్‌ చేయాలని కుట్రపన్నాడు. విధ్వంసాలకు శిక్షణ, పేలుడు పదార్థాలు కొనుగోలు, ఆయుధాల సేకరణ పేరుతో కొన్ని విదేశీ సంస్థల నుంచి హవాలా ద్వారా భారీగా నిధులు సమీకరించాడు. అయితే వాటిని తన సొంత ‘ఖాతా’ల్లోకి మార్చుకుంటూ మంగుళూరు సమీపంలోని థోయ్యత్తు, ఉల్లాల్‌ పరిసరాల్లో భారీగా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు నిర్వహించాడు. హైదరాబాద్, జైపూర్, బెంగళూరు, అహ్మదాబాద్‌ పేలుళ్ల నిమిత్తం అంటూ విదేశీ సంస్థల నుంచి రూ.లక్షల్లో నిధులు సమీకరించాడు. భత్కల్‌ ఇండియన్‌ ముజాహిదీన్‌లో సెకండ్‌ కమాండ్‌ ఇన్‌చార్జి హోదాలో ఉండటంతో నిధులపై అజమాయిషీ ఇతనిదే. దీంతో జమాఖర్చులు అడిగే సాహసం మాడ్యుల్‌లోని ఎవరూ చేయలేకపోయారు.

‘ఐఎం’ గుట్టు బయటపడింది ఇతని వల్లే...
ఐఎంలో కీలక వ్యక్తిగా ఉన్న రియాజ్‌ భత్కల్‌ అనేక పేలుళ్ల సందర్భంలో కొన్ని ఈ–మెయిల్స్‌ రూపొందించి మీడియా సంస్థలకు పంపాడు. ఇలా చేయడాన్ని మరో ఉగ్రవాదైన సాదిక్‌ షేక్‌ పూర్తిగా వ్యతిరేకించాడు. దీని వల్ల తమ ఉనికి బయటపడుతుందని, దర్యాప్తు సంస్థలకు పట్టుబడే అవకాశం ఉందని వాదిస్తూ వచ్చాడు. తమ లక్ష్యం నెరవేరాలంటే సాధ్యమైనంత ఎక్కువ కాలం తెరవెనుకే ఉండటం మంచిదని రియాజ్‌తో చెప్పాడు. అయితే ఈ మాటలను రియాజ్‌ పెడచెవిన పెట్టాడు. ప్రతి విధ్వంసానికీ అత్యంత పకడ్బందీగా వ్యూహరచన చేసి కథనడిపేది తామైతే... చివరకు పేరు మాత్రం సీమాంతర ఉగ్రవాద సంస్థలకు రావడం రియాజ్‌కు రుచించలేదు. తమ సంస్థ పేరు బయటకు వచ్చి ప్రచారం జరిగితే నిధులు సైతం భారీగా వస్తాయంటూ సాదిక్‌తో వాదనకు దిగాడు. చివరకు తన పంతం నెగ్గించుకుని ప్రతి విధ్వంసానికీ ముందు ఈ–మెయిల్‌ పంపడం ప్రారంభించాడు. ఈ మెయిల్స్‌ వచ్చిన ఐపీ అడ్రస్‌ ఆధారంగా దర్యాప్తు చేసిన అధికారులు ఐఎంకు సంబంధించిన కొన్ని వివరాలు సేకరించారు. అలా ప్రారంభమైన దర్యాప్తుతోనే 2008లో ఐఎం గుట్టురట్టయింది. దీంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన రియాజ్‌... ప్రస్తుతం పాకిస్థాన్‌లోని కరాచీ సమీపంలో ఉన్న డిఫెన్స్‌ ఏరియాలో తలదాచుకుంటున్నాడు.

ముష్కరులను వెంటనే ఉరితీయాలి  
అమాయకులను పొట్టన పెట్టుకున్న ముష్కరులను వెంటనే ఉరితీయాలి. కాలయాపన చేయకుండా శిక్ష అమలు చేస్తేనే అమరుల ఆత్మ శాంతిస్తుంది. ఆనాటి ఘటనలో గాయపడిన
క్షతగాత్రులను ప్రభుత్వం ఆదుకోవాలి.
– పి.రామకృష్ణ, : పేలుళ్లలో గాయపడ్డ బాధితుడు

పేలుళ్లలో గాయపడ్డ బాధితుడు
శిక్షిస్తేనే చట్టాలపై నమ్మకం కలుగుతుంది...చట్టాలపై ప్రజల్లో నమ్మకం కలగాలంటే తీవ్రవాదులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలి. వారు శిక్ష నుంచి బయటపడకుండా  చూస్తేనే ప్రజలు హర్షిస్తారు. బాంబు పేలుడు ఘటన జరిగిన ప్రదేశానికి ఎప్పుడు వెళ్లినా ఒళ్లు జలదరిస్తుంది.
– సుధాకర్‌రెడ్డి :  ప్రత్యక్ష సాక్షి, దిల్‌సుఖ్‌నగర్‌ 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement